- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ నల్లికుట్లోళ్లను గోతిలో పాతి పెట్టండి.. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం హాట్ కామెంట్స్
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు ఏం చేసిందో ఈ రెండేళ్లలో మేమేం చేశామో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని నిరూపించింది డా.బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు. ఈ దేశానికి రెండు కళ్లలో ఒకటి మహాత్మగాంధీ అయితే మరో కన్ను డా.బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ జయంతి (BR Ambedkar Jayanti) సందర్భంగా ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు:
విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని, ఈ విద్య ద్వారానే సమాజంలో సముచిత స్థానం, గౌరవం ఇస్తుందని సంపూర్ణంగా నమ్మారన్నారు. ప్రపంచ దేశాలలోని పేరెన్నిక గల యూనివర్సిటీల్లో చదివి వచ్చిన అంబేద్కర్ ఆలోచన విధానమే ఇవాళ భారతదేశం ఆలోచన అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానమే ప్రజాపాలన విధానం అని, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల పిల్లలే ముందుండి ప్రత్యేక పాత్ర పోషించారు. అంబేద్కర్‍తో పాటు ఇవాళ గద్దర్‍ను గుర్తు చేసుకోవాలన్నారు. గద్దర్ తన కాలికి గజ్జె కట్టి గొంగడి భుజాన వేసి తెలంగాణ పల్లెల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. ఈ చరిత్రను సమాజం మరిచిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతం ఈ నినాదం రణనినాదమై తెలంగాణ పల్లెల్లో మార్మోగి రాష్ట్రాన్ని సాధించుకునేలా చేసిందని ఈ గీతమే ఇప్పుడు రాష్ట్ర గీతంగా అవతరించిందన్నారు.
గత ప్రభుత్వంలో దళితులంటే ఓర్వలేదు:
తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో ఉద్యమంలో ముందున్న వారి పరిస్థితి ఎలా ఉంది? గద్దర్, అందెశ్రీ లాంటి వారి పరిస్థితి ఎలా ఉందని ఆలోచించాలన్నారు. గత పాలకులు ఎన్నికల్లో ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ మంత్రివర్గంలో దళితులు, గిరిజనులకు వారిచ్చిన ఇచ్చిన స్థానం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఆనాడు మంత్రి వర్గంలో ఏ జాతికి ఎంత స్థానం ఉంది? ఈనాడు మంత్రి వర్గంలో ఎంత స్థానం ఉందో మీరే లెక్క చెప్పాలన్నారు. ఒక స్పీకర్‍తో పాటు నలుగురు మంత్రులు, విప్‍లలో దళితులు, గిరిజనులకు ఇంతటి ప్రాతినిథ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా దక్కలేదన్నారు. భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్‍గా ఉంటే ఓర్వలేక అవమానకర రీతిలో అతడిని తొలగించిన చరిత్ర మన కళ్లముందే ఉందన్నారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంత మంది అసెంబ్లీకే రావడం లేదంటే దళితుల పట్ల గౌరవం ఏపాటిదో ఓ సారి ఆలోచన చేయాలన్నారు. అందువల్ల వారి చేత మోసం, అవమానానికి గురైందో అదే జాతి బిడ్డను అధ్యక్ష నాకు మైక్ ఇవ్వమని అడిగే పరిస్థితి ప్రజా ప్రభుత్వం కల్పించిందన్నారు. 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా దళితులకు అవకాశం ఇచ్చామన్నారు.
వారిని గోతిలో పెట్టే బాధ్యత మీదే:
దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలే ఈ దేశం భారతం భవిష్యత్, సంపద అని ప్రజా ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని రకాలుగా ప్రోత్సహించడానికే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నాల వల్లే గత పదేళ్ల పాలన, ఈ రెండేళ్ల మా పాలన చూసి ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలుమాకు పట్టం కడుతుంటే చూసి ఓర్వలేక కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేము ఇందిరమ్మ ఇండ్లలో మెజారిటీ వాటా దళితులు, గిరిజనులకు ఉందనేది నిజం కాదా? మేము వచ్చాక 67 వేలకు పైగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాయన్నారు. గతంలో జరిగిన అప్పులు, తప్పులను సరిదిద్దుకుంటూ మేము ముందుకు వెళ్తుంటే కొంత మంది వెనకాల నుంచి కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారు. అలాంటి వారిని అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోండి. ముందు వైపు నేను చూసుకుంటా. వెనకాల గోతులు తవ్వే వారిని, నక్కజిత్తులోలను, నల్లికుట్లోలను మీరే ఏదో ఒకటి చేయాలన్నారు. లేదంటే మంచి లక్ష్యంతో పని చేస్తుంటే నష్టం జరుగుతుందన్నారు. గత పాలకులు అంబేద్కర్ కు జయంతి, వర్ధంతికి ఎన్నిసార్లు నివాళి అర్పించారో అర్థం చేసుకోవాలన్నారు.
బీజేపీ కుట్రలు:
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారని 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ చెప్పారని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంచి పనికి మా ప్రభుత్వం ముందుంటుందని ఈ ప్రభుత్వం మీది.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదన్నారు.






