Credai: నేను మధ్యతరగతి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని ఆ పని చేయలేను: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Credai: నేను మధ్యతరగతి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని ఆ పని చేయలేను: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అపోహలు, అనుమానాలను దాటుకుకుని అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో అపోలు సృష్టించి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్న వారికి కనువిప్పుకలిగించేందుకే కెడ్రాయ్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. హైదరాబాద్ హెటెక్స్ లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివని పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకతతో పాటు ఆ విధానాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులు సృష్టించే అనుమానాలకు మీరంతా ఊతమిస్తే అంతిమంగా మీ ప్యాపారానికే నష్టం అవుతుందన్నారు. పెట్టుబడిదారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని, పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదన్నారు. పెట్టుబడిదారులు ప్రభుత్వంతో తమ అనుభవాలను పంచుకోవాలన్నారు. ఎలాంటి అపోహలకు తావివ్వొద్దని సూచించారు. ప్రపంచ వేదికలపై విదేశీపెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరం, దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించం? మిమ్మల్ని వదులుకుంటామని ఎందుకు ఆలోచన చేస్తున్నారని ప్రశ్నించారు.

నాది సగటు మధ్యతరగతి ఆలోచన:

నేను పెట్టుబడిదారి ఆలోచన ఉన్నవాడిని కాదని మధ్యతరగతి మనస్తత్వం కలిగిన వాడినని నాకు పరిమితులు ఉంటాయన్నారు. అందువల్ల ప్రతి వ్యక్తి నా దగ్గరకు వస్తే వారు అనుకున్నంత మేరకు నేను సహకరించకపోవచ్చన్నారు. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన నాకు లేదన్నారు. అందువల్ల గతంలో మీరేదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని నేను కొనసాగించకపోవచ్చని దాంతో సహజంగానే నాపై కోపం వస్తుంది. స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నవారికి అకస్మాత్తుగా ఈ సౌకర్యం లేకపోతే సహజంగానే కోపం ఉంటుంది. ఇలాంటి వారు నన్ను మన్నించాలి. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించు. కానీ పారదర్శకమైన పాలసీలు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నేను ఓపెన్ మైండ్ తో ఉన్నానని ప్రజలకు ఉపయోగపడి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పాలసీలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వాటిని నేను చాలెంజ్ గా తీసుకుంటాన్ననారు. పాలసీల ద్వారానే నేను మెప్పు పొందుతానన్నారు.

ఫ్యూచర్ సిటీ అంటే ఫోర్ బ్రదర్ సిటీ అంటారా?

కాలుష్యరహితంగా ఉండేలా అద్భుతరీతిలో నేను ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటుంటే కొందరు దాన్ని ఫోర్ బ్రదర్ సిటీ అంటున్నారని మీరే కదా నా బ్రదర్స్ అని సీఎం హాట్ కామెంట్స్ చేశారు. మీకోసమే నేను చేస్తున్నాను. అలాంటి విమర్శలను నేనెందుకు పట్టించుకోవాలన్నారు. వైఎస్సార్ రింగ్ రోడ్డు, చంద్రబాబు హైటెక్ సిటీ అభివృద్ధి చేస్తున్నప్పుడు చాలా మంది ఇలాంటి విమర్శలే చేశారన్నారు. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన మేము ఈ దేశ వాసులను ఎందుకు ప్రోత్సహించమే ఆలోచించాలన్నారు. మెట్రో విస్తరించకపోవడంతో వెనుకబడిపోయామన్నారు. గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ఉన్న చోటనే మెట్రో విస్తరణకు పూనుకున్నారని విమర్శించారు.

ఢిల్లీలో సీఎంకు బంగ్లా దావాత్ లకు కాదు:

తాను రాష్ట్ర అభివృద్ది పనుల కోసం ఢిల్లీ వెళ్తుంటే హర్రాస్ పాట పాడినట్లు కొంత మంది లెక్కలు వేస్తున్నారు. అనుమతులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వ అయితే మరి నేను ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి ప్రశ్నించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతులు తెచ్చుకోవడానికి తప్ప దాన్ని ఫామ్ హౌస్ లా వాడుకుంటూ దావత్ లు చేసుకోవడానికి కాదన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే 26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించాను. అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నా.. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం అన్నారు. తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నాం. వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ ఎలా అభివృద్ధి అవుతుంది? హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం.. త్వరలోనే అనుమతులు రాబోతున్నాయన్నారు.

తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నట్టు చెప్పారు. నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని దానికి మీరు మద్దతుగా నిలిస్తే మీకే నష్టం అన్నారు. తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం మీరు ప్రమోట్ చేయండన్నారు. ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. నాకు వేరే కోరికలేం లేవని హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

Next Story