వర్షాల కోసం కృష్ణా జలాలతో పడమటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక జలాభిషేకం

by Batti.Sumithra |

వర్షాభావ పరిస్థితులు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామికి పవిత్ర కృష్ణా నది జలాలతో ప్రత్యేక జలాభిషేకం నిర్వహించారు.

వర్షాల కోసం కృష్ణా జలాలతో పడమటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక జలాభిషేకం
X

దిశ, ఊట్కూర్ : వర్షాభావ పరిస్థితులు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామికి పవిత్ర కృష్ణా నది జలాలతో ప్రత్యేక జలాభిషేకం నిర్వహించారు. కృష్ణ మండల కేంద్రం సమీపంలోని పవిత్ర కృష్ణా నది నుంచి భక్తులు భజనలు చేస్తూ కలశాల్లో తీర్థజలాలను తీసుకొచ్చి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటల మొలకలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి, పంటలు బాగా పండేలా చేయాలని, భూగర్భ జలమట్టాలు పెరిగి బోర్లు, బావులు నీటితో నిండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు నర్సింహాచారి, వేణుగోపాలాచారి, హెచ్. నర్సింహా, వెంకప్ప గౌడ్, ఉప్పు ఆంజనేయులు, సుధాకర్ రెడ్డి, మహేష్ గౌడ్, వాకిటి శివకుమార్, సి. అశోక్, ఎన్.తిరుపతి, చిన్న నర్సింహా, ఎం. ఆంజనేయులు, తాయప్ప, మాల హన్మంతు, కిష్టప్ప, ఎల్. చిన్నరాజు, హన్మిరెడ్డి, తులసీదాస్, సీతా ఆంజనేయులు తదితర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story