తెలంగాణ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. స్పోర్ట్స్ రివ్యూలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-09 09:10:30  IST  )

క్రీడాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్టేడియాల ఆధునీకరణపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ క్రీడాకారులకు గుడ్ న్యూస్.. స్పోర్ట్స్ రివ్యూలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చేలా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన అన్ని వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి క్రీడాశాఖపై సమీక్ష (Telangana Sports Review) నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు. గచ్చిబౌలి ఔట్‍డోర్ స్టేడియాన్ని పునర్నిర్మించి ఆధునీకరించడంతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల కోసం మైదానాలు ఇతర శిక్షణా సదుపాయాలను స్టేడియం ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతిపాదిత నిర్మాణాలకు సంబంధించిన పలు ఆర్కిటెక్చర్ నమూనాలను సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

స్టేడియాలకు కొత్త శోభ:

అదేవిధంగా భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు తెలంగాణను వేదికగా నిలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్‍బీ స్టేటియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేటియంలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకాటి శ్రీహరి (Vakiti Srihari), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎంవో ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రాజు, శేషాద్రి, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా.జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story