నిర్మల్ షార్ట్ సర్క్యూట్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కలెక్టర్‍కు కీలక ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-30 08:11:58  IST  )

నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నిర్మల్ షార్ట్ సర్క్యూట్  ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కలెక్టర్‍కు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ జిల్లా (Nirmal District) పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట కాలిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ ప్రమాదంతో రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై వెంటనే స్పందించిన సీఎం.. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టినట్లు గురువారం సీఎంవో వెల్లడించింది.

చేతికొచ్చిన సమయంలో ప్రమాదం:

కాగా, పెంబి మండల కేంద్రానికి చెందిన గోసుకుల రాములు, కన్నె మల్లేశ్‍లకు చెందిన సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట చేనులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయితే ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట కోతకు వచ్చే సమయంలో ఇలా అగ్నికి ఆహుతి కావడంతో బాధిత రైతుకుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలు వైరల్ అతున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడి బూడిదైపోయిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

Next Story