CM Revanth Reddy : కాంగ్రెస్ పెద్దలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

CM Revanth Reddy : కాంగ్రెస్ పెద్దలతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు కాంగ్రెస్ అధిష్టానంతో కీలక సమావేశం నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)లతో సీఎం రేవంత్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ పదవులు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన వంటి విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణలో జరిగిన మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, కొందరు మంత్రుల శాఖలలో మార్పులపై చర్చ జరిగింది. సీనియర్ మంత్రులు వివిధ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో, కొన్ని శాఖలను ఇతరులకు బదిలీ చేసే అంశంపై కూడా సంప్రదింపులు జరిగాయి. నిన్న టీపీసీసీ కార్యవర్గ నియామకాలు చేపట్టగా.. పదవులు దక్కని వారికి న్యాయం చేసేందుకు వివిధ రాష్ట్ర రంగ సంస్థలకు చైర్మన్ పదవులను కట్టబెట్టే దిశగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనకు సంబంధించి జనంలో ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, ఈ సభలకు రాహుల్ గాంధీ, ఖర్గే వంటి సీనియర్ నాయకులను ఆహ్వానించే ప్రతిపాదనలు జరిగాయని సమాచారం.

మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ సభ, సూర్యాపేటలో బీసీ కుల గణన సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

Next Story