CM Revanth Reddy: కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పంపిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు.

CM Revanth Reddy: కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని, వీటి రిపేర్ల కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఇవాళ నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష (Irrigation Review) నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‍లో మంత్రి ఉత్తమ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్‌రాజ్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పంపిన లేఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు వివరించిన రేవంత్ రెడ్డి వాటిపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులకు పలు సూచనలు చేశారు. లేఖలో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టువారీగా విశ్లేషణలు చేసి పూర్తిస్థాయి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని డ్యామ్‍లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టులవారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

ఆదిలాబాద్‍కు ప్రాణాళికలు రూపొందించండి:

ఈ సమీక్షలో తుమ్మిడిహట్టి వద్ద చేపట్టాల్సిన ప్రాజెక్టుపై సీఎం చర్చించారు. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు అంచనాలను తయారు చేయాలని సూచించారు. సుందిళ్లను రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Next Story