ఆ బాధ్యత నాది.. మహిళ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2026-05-25 12:00:02  IST  )

మహిళా వారోత్సవాల సందర్భంగా 8 వేల ఇందిరా స్త్రీశక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేసి కీలక హామీలు ఇచ్చారు.

ఆ బాధ్యత నాది.. మహిళ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందని, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లకు పైగా రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. మహిళా సంఘాలు ఉత్పత్తుల గోడౌన్‍లకు స్థలాలు ఇస్తామన్నారు. నాణ్యమైన వస్తువు కొనలాంటే మహిళా శక్తి సంఘాల వద్దే కొనాలనుకునేలా బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలని సూచించారు. బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బ్యాంక్ లోన్ల చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు తొలి స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం మహిళా వారోత్సవాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 8 వేల ఇందిరా స్త్రీశక్తి భవనాలకు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లలో మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు.

అడ్డుకోవాలని కుట్రలు చేశారు:

ఆడబిడ్డల అండతోనే మా ప్రభుత్వం ఏర్పడిందని అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, కొంత మందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని విమర్శించారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని, మహిళలను బస్సులకు యజమానులు చేశామన్నారు. అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలనే బంక్ లు పెట్టించామన్నారు. దళారులు, వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఇకపై మహిళల సంఘాల వద్దే వడ్లను భద్రపరుస్తామన్నారు. రైస్ మిల్లులు, గౌడౌన్లు పెట్టుకోవాలని ఇందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళా సంఘాలు సూపర్ బజార్లు పెట్టుకోవాలని సూచించారు.

Next Story