CM Revanth Reddy: బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని రాష్ట్ర నీటి హక్కులు కాపాడటంలో సాంకేతికంగా, రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ ప్రజాభవన్ లో ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు తదితరులు హాజరైన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖను పదేళ్లపాటు చూసిన కేసీఆర్, హరీశ్ రావు నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి తీరని నష్టం చేశారని ధ్వజమెత్తారు. 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయనే రాచపుండును పెట్టిందే కేసీఆర్ అని కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. 811 టీఎంసీల్లో తెలగాణకు 299 టీఎంసీలు చాలని, 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారిందని, ఈ సంతకాలు చేసి మన హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. 400 టీఎంసీలు రాయలసీమకు తరలించేందుకు కేసీఆర్ హయాంలోనే చర్చలు జరిగాయని 2016 లోనే కేసీఆర్, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి. జగన్ వచ్చాక పెన్నాకు తరలింపుపై ప్రగతి భవన్ లోనే చర్చలు జరిగాయి. కేసీఆర్ హయాంలో జరిగిన చర్చల మేరకే చంద్రబాబు ప్రాజెక్టు కడుతున్నారన్నారు. జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఏపీ ప్రాజెక్టుల గురించి కేసీఆర్, హరీశ్ రావు మాట్లాడలేదు. జగన్ దిగిపోయి చంద్రబాబు రాగానే జలాల సెంటిమెంట్ ను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.

క్షుద్రపూజల ఫామ్ హౌస్ నాయకుడు:

కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్ధాల మీద బతుకుతోందని వాళ్ల సిలబస్, సక్సెస్ సీక్రెట్ అంతా అబద్ధాలు చేప్పడమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ బద్ధాలతోనే బీఆర్ఎస్ 2023లో అధికారం కోల్పోతే 2024 లో డిపాజిట్లు రాలేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకలేదని ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి అన్నారు. నదుల పునరుజ్జీవనం కాదు పార్టీ పునరుజ్జీవనం కోసమే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, నీళ్లను అడ్డం పెట్టుకుని పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. సెంటిమెంట్ తో ఏపీసీఎంను, తెలంగాణ సర్కార్ ను భూతంగా చూపెట్టే కుట్రలు చేస్తున్నారు. క్షుద్రపూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి తన పార్టీని బతికించుకోవడానికి ఇదొక్కటే ఆధారం అని ఆలోచన చేసి మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా-గోదావరి మీద అసెంబ్లీలో చర్చ చేద్దామని కోరా. కేసీఆర్ హరీశ్ రావు సభకు రావాలన్నారు. వరద జలాలను తరలిస్తే తెలంగాణకు ఇబ్బందేంటని ఏపీ వాదిస్తోంది. మరి నికర జలాల్లో మా వాటాపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోందని సీఎం ప్రశ్నించారు. మాకు మొదటి పంటకే నీళ్లు లేవని ఏపీ మాత్రం మూడో పంట కోసం ప్రయత్నిస్తోందన్నారు.

బీజేపీ నూతన అధ్యక్షుడికి సూచన:

తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచందర్ రావుకు శుభాకాంక్షలు.. రాష్ట్ర అధ్యక్షుడిగా మీ మొదటి కార్యాచరణ గోదావరి నది జలాల సమస్య పరిష్కారాన్ని పెట్టుకోండి. ఈ సమస్యను మీరు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లండి అని రేవంత్ రెడ్డి సూచించారు. మీకు అవసరమైన సమాచారాం కావాలంటే సంబంధింత అధికారులు మీకు ఇస్తారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ముక్తకంఠంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రడ్డి కేసీఆర్ కోసమే పని చేస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ దగ్గర నుంచే వస్తుందని ఆరోపించారు. మేము వస్తున్నామంటే కిషన్ రెడ్డి ముందే వెళ్లి కేంద్ర మంత్రిని కలుస్తున్నారు. కిషన్ రెడ్డి తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు మాతో ఎందుకు రావడం లేదు. మాకంటే ముందే వెళ్లి రహస్యంగా చర్చించాల్సిన అవసరమేంటి అని ప్రశ్నించారు. ఏపీ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు రోజు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. నీటి కేటాయింపుల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. చావుబతుకుల్లో ఉన్న బీఆర్ఎస్ ను బతికించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు.

కేంద్రం నిర్ణయం తాత్కాలికమే:

బనకచర్లకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టలేదని కేవలం కామా మాత్రమే పెట్టిందని సీఎం అన్నారు. మోడీ మనుగడ చంద్రబాబుపై ఆధారపడితే చంద్రబాబు మనుగడ గోదావరిపై ఆధారపడిందన్నారు. ఇరు రాష్ట్రాల చర్చలకు రావాలి, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. మన హక్కులు కాపాడుకోవడాలంటే నిరంతరం పోరాటం చేయాలన్నారు. సోషల్ బీఆర్ఎస్ మీడియా, మీడియాలో సృష్టిస్తున్న వాటితో ప్రజాప్రతినిధులు ఎవరూ కన్ ఫ్యూజ్ కావొద్దన్నారు. తప్పులు చేసింది వాళ్లే, సమర్థించుకుంటున్నది వాళ్లే, ఆ తప్పులను మనపై రుద్దాలని చూస్తున్నారు. మేధావులు, ప్రొఫెసర్లు, రాజకీయవేత్తలు ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సిన పోరాటంపై ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వాలన్నారు.

Next Story