CM Revanth Reddy: ఇకనైనా అహంకారం తగ్గించుకోండి.. సర్పంచ్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

by Prasad Jukanti |

పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఇకనైనా అహంకారం తగ్గించుకోండి.. సర్పంచ్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, ఈ ఫలితాలు మా రెండేళ్ల పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ రెండు కూటమిగా కలిసి పోటీ చేశాయని అయినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని, పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రజాపాలనకు రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్నాం. అదే సమయంలో సర్పంచ్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశీర్వదించారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ మాకే మద్దతు తెలిపారు. అంటే అర్బన్ తెలంగాణతో పాటు రూరల్ తెలంగాణలో ప్రజలు మాకు అండగా నిలిచారని ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయని భవిష్యత్ లో మరింత భాధ్యతతో పని చేస్తామన్నారు.

87 నియోజకవర్గాల్లో మాదే పైచేయి:

సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. మొత్తం 12,702 సర్పంచ్ స్థానాల్లో 7,527 స్థానాల్లో కాంగ్రెస్, 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా కలిసి 4224 స్థానాలు గెలుచుకున్నాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్ తో కలిపి 66 శాతం కాంగ్రెస్ గెలుచుకుంటే బీఆర్ఎస్, బీజేపీ కలిపి 33 శాతం స్థానాలు గెలుచుకున్నాయన్నారు. కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 21 నియోజకవర్గాల్లో ప్రజలు మావైపు నిలిచారన్నారు. 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిందన్నారు. బీఆర్ఎస్ 6 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తే, ముథోల్ నియోజవర్గంలో బీజేపీ అధిక స్థానాలు గెలిచిందన్నారు. పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం అని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మా రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామన్నారు. 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 87 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ 3511 పంచాయతీలు, బీజేపీ 710 పంచాయతీలు గెలిచిందన్నారు.

మూసీ కంటే ఆయన కడుపులోనే విషం ఎక్కువ:

సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేగా పేరు మార్చడమే కాకుండా విధానాలు మార్చి పేదలకు ఈ పథకం అందకుండా చేయాలని కక్ష, కుట్ర కేంద్ర ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసుల విషయంలో మారకపోవడం కళ్లతో చూస్తున్నామన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారన్నారు. భవిష్యత్ లో ఇంకా బాధ్యతతో, మరింత బలంగా పని చేస్తామన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నవారికి అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఇంకొకాయన కడుపు నిండా విషయం పెట్టుకుని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. మూసీలోని కాలుష్యం కంటే కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ దగ్గించుకోవాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలన్నారు.బరితెగించి వ్యవహరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2029లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

Next Story