సినిమా షూటింగ్‌లపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలకు పోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా షూటింగ్‌లపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ సిటీ పరిధిలో రోడ్లు రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం రూ.24,500 కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ – శిల్పా లే అవుట్ ఎలివేటెడ్ కారిడార్, బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌లకు శంకుస్థాపన చేశారు. కోత్వాల్​ గూడ ఎకో-హిల్ పార్క్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారబోతుందని, బెంగళూరు, అమరావతి, చెన్నైనగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుందన్నారు. కొత్త ప్రాజెక్ట్ లు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుందని, వాళ్ళను అనాథలను చేయబోమని భరోసా ఇచ్చారు. భూమి, ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చి దిద్దుతామని, ట్రంప్, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని తెలిపారు. ప్రపంచం తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

‘సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలకు పోతున్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చు. చంద్రబాబు, వైఎస్ సమయంలో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారు. నాటి నిజాం నవాబు ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో వరదల నివారణకు మూసీపైన నిర్మాణాలు చేపట్టారు. వికారాబాద్‌లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్‌లు నాటారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ లాంటి చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్ ఆక్రమణలు, చెత్తతో నిండిపోయింది. నగరాన్ని మంచిగా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మేము చేయలేదు మీరు చేయొద్దని అంటున్నారు. వాళ్లకు ఫార్మ్ హౌస్‌లు వచ్చాయి. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపాం. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది..కానీ ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారింది. మూసీ మురికిలో బతకాలని ఎవరు అనుకోరు. మూసీ పక్కన నైట్ ఎకనామిని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం. ఇందిరమ్మ చీరల్లో ఆడ బిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారు. గతం లో ఇచ్చిన బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి వాడారు. ఈ సారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story