అసలు విషయం గ్రహించాకే నాగార్జున ఆ పనిచేశారు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో హైడ్రా అధికారులు పునరుద్ధరించిన బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

అసలు విషయం గ్రహించాకే నాగార్జున ఆ పనిచేశారు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో హైడ్రా అధికారులు పునరుద్ధరించిన బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా(Hydraa) చర్యలతో బతుకమ్మ కుంటకు మళ్లీ జనం వస్తున్నారని అన్నారు. రూ.7.40 కోట్లతో బతుకమ్మకుంటను అద్భుతంగా సుందరీకరణ చేశారని కొనియాడారు. వీహెచ్‌ బతుకమ్మ కుంట కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అందరి కోరిక మేరకు బతుకమ్మ కుంటకు వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) పేరు పెడతామని కీలక ప్రకటన చేశారు. ఈ రోజు సంతోషరకరమైన పర్వదినం. నేను హైడ్రా స్టార్ట్‌ చేసినప్పుడు చాలా మంది చాలా రకంగా మాట్లాడారు. హైడ్రా తీసుకొచ్చి మంచిపని చేస్తుంటే బురదజల్లారని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు చెరువులు, మూసీ నది గొప్ప వరమని అన్నారు. కానీ చెరువులు, మూసీ నది కబ్జాకు గురై వరద సమస్య పెరిగిందని అన్నారు. చెరువులు, మూసీలోని కబ్జాలు హైదరాబాద్‌కు శాపంగా మారాయని చెప్పారు.

మూసీ పరివాహకంలోని పేదల పట్ల తనకు సంపూర్ణ అవగాహన, సానుభూతి ఉందని అన్నారు. తాను పేదలకు మేలు చేయాలనుకునే వ్యక్తిని అని.. ఎప్పటికీ నష్టం, అన్యాయం చేయబోను అని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంత పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. మూసీ నది పునరుజ్జీవంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. అందరూ సహకరిస్తేనే ప్రభుత్వం చేయాలనుకున్నది సాధ్యమవుతుందని చెప్పారు. హైటెక్ సిటీలోని తుమ్మడికుంట కూడా ఆక్రమణకు గురైంది. అదే కుంటలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఎన్ కన్వేన్షన్ హాల్ కట్టారు. హైడ్రా కూల్చివేసి, వివరించిన తర్వాత నాగార్జున వాస్తవం గ్రహించారు. స్వయంగా రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బతుకమ్మకుంట లాగే నగరంలోని చాలా చెరువులను కాపాడి.. పూర్వవైభవం తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు.

Next Story