- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆయన చివరి కోరిక నెరవేరుస్తా’: కొడంగల్‌లో CM రేవంత్ కీలక ప్రకటన
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గుంపులు, గ్రూపులు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గుంపులు, గ్రూపులు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో తలపెట్టిన పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి శంకుస్థాపన చేశారు.
భూ సేకరణ పూర్తి..
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైన పరిస్థితులను వివరిస్తూ, ప్రస్తుతం చేపట్టిన పనుల గురించి సమగ్రంగా వివరించారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో మెడికల్, ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐలు, సైనిక్ స్కూల్స్.. 225 ఎకరాల్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. అతివేగంగా పనులు జరుగుతున్నాయని చెబుతూ ఏడాది లోపు పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఆనాడు చదువుకోవడానికి ఈ ప్రాంత వాసులు రాష్ట్రం నలుమూలల వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఈనాడు రాష్ట్రం నలుమూలల నుండి మంచి చదువుల కోసం కొడంగల్‌కు రావలసిన విధంగా పనులు చేపట్టామని తెలిపారు. “ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. మక్తల్ – నారాయణపేట – కొడంగల్‌కు నీళ్లు, రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి. కృష్ణా నది జలాలతో ఈ ప్రాంత భూములు తడవాలి. దీనికి జిల్లా ఇంచార్జి మంత్రి రాజనర్సింహ ప్రతి నెల సమీక్ష నిర్వహించాలని కోరుతున్నా. భూ సేకరణ పూర్తి చేసినం. అనుమతులు అన్నీ వచ్చాయి. పనులు ముందుకు సాగాలి” అని అన్నారు.
లగచర్ల దగ్గర ఇండస్ట్రియల్ పార్క్..
“ఇప్పుడు నిధులకు అడ్డంకి లేదు. అన్ని మండలాలకు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. పనులు వేగంగా జరిగే విధంగా సర్పంచులు, స్థానిక ప్రతినిధులు చురుకుగా పనిచేయాలి. కృష్ణా - వికారాబాద్ రైల్వే లైన్‌కు కూడా సూత్రప్రాయంగా అనుమతి తెచ్చుకున్నాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపురాయి ఉంది. టేకులగోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినం. రాబోయే ఆర్నెళ్లలో సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ను లగచర్ల దగ్గర కట్టుకుంటున్నాం. కోస్గీ నుండి నేరుగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు 300 అడుగుల రోడ్డు వేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఊర్లో చిన్న సమస్యలు, బేదాభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మీరంతా కలిసి కట్టుగా ఉండాలి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. “తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చేయాలని చాలా మంది నాయకులు కలలు కన్నారు. వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దేశం గర్వించదగిన ఆగమశాస్త్ర సలహాదారులు సుందర వరదాచార్యులు గారు ఇక్కడ వీధుల్లో రథాన్ని తిప్పడానికి మీరు బాధ్యత తీసుకోవాలని నన్ను కోరడంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టాం” అని వివరించారు.
కలెక్టర్‌కు కీలక ఆదేశాలు..
“ఇప్పుడాయన మన మధ్యలో లేకపోవడం తీరని లోటు. సుందర వరదాచార్యులు గారి చివరి కోరికను తీర్చడంతో పాటు, వారిని ఈ ప్రాంతం, ఈ సమాజం గుర్తు పెట్టుకునే విధంగా మందిరాన్ని తీర్చిదిద్దుతాం. అలాగే, సుందర వరదాచార్యులు పేరు ఈ ప్రాంగణంలో ఏదో ఒక విడిదికి పెట్టాలని” ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దేవాదాయ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కి సూచించారు. “ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. జెండా, అజెండాలకు సంబంధించినది కాదు. ఇది మన ప్రాంతం, రాష్ట్రం గర్వించదగ్గ ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం. ఇక్కడి వారినే కాదు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చే ప్రజలను కూడా ఆశీర్వదించడానికి ఒక గొప్ప దైవ కార్యం. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రతిష్టను దేశ స్థాయిలో విస్తరించడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నా. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కొడంగల్ బిడ్డ మీ ముందు నిలబడ్డా..” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.






