‘ఎనుముల రేవంత్ మాదిగ.. అని పిలిచినా పలుకుతా’

by Gantepaka Srikanth |

అందరినీ స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

‘ఎనుముల రేవంత్ మాదిగ.. అని పిలిచినా పలుకుతా’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రతి నెల 1000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.. నెల‌కు రూ.1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వ‌స్తోంది.. అయినా స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చే బాధ్య‌త ప్ర‌భుత్వ ఉద్యోగుల‌దే.. అక్ర‌మాల‌ను అరిక‌ట్టి ఖ‌జానాకు నిధులు తీసుకువ‌స్తే ప‌ది మందికి స‌హాయం అందుతుంది.. గ‌తంలో జాగీరుదారులు, జ‌మీందార్ల ద‌గ్గ‌ర వేలాది ఎక‌రాల భూములు ఉండేవి.. అసైన్డ్ భూముల విష‌యంలో ప్ర‌భుత్వం అన్నిర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది.. పంచ‌డానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భూములు లేవు.. ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు ప‌రిమితంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

విద్య అవ‌స‌రం..

దారిద్ర్య రేఖలో ఉన్న జాతి ముందుకు న‌డ‌వాలంటే విద్య అవ‌స‌రం.. నా ద‌గ్గ‌ర ఉన్న విద్యా శాఖ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నాను.. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం.. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కాస్మోటిక్ , డైట్ ఛార్జీలు పెంచాం.. అవ‌కాశం వ‌స్తే ప‌ది మందికి సాయం చేస్తార‌నే మంచి పేరు మీరు, నేను తెచ్చుకోవాలి.. గ‌త ప్ర‌భుత్వం బర్రెలు, గొర్రెలు, చేప‌లు ఇచ్చింది..చెప్పులు కుట్టుకొమ్మ‌ని చెప్పింది.. బ‌ర్రెలు, గొర్రెలు , చేప‌లు కాదు.. చెప్పుకుట్టుకున్న జాతి ఈ రాజ్యాన్ని న‌డ‌పాలి.. క‌లెక్ట‌ర్లు, డాక్ట‌ర్లు, ఇంజనీర్లు, లాయ‌ర్లు కావాలి.. తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి.. నా శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు మీకు సాయం చేస్తాను.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీరాకుమార్ ఎలా ప‌నిచేశారో అలాంటి స్పూర్తితో ప‌నిచేస్తా.. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేసిన‌ప్పుడు రేవంత్ మాదిగ‌, బీసీలు రేవంత్ యాద‌వ్, వాకిటి శ్రీహ‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తే రేవంత్ ముదిరాజ్ అని, సిక్కులు స‌ర్దార్ రేవంత్ అని అస‌దుద్దీన్‌కు సాయం చేశాన‌ని రేవంతుద్దీన్ అని న‌న్ను అన్నారు.. ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అంద‌రి వాడినిని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story