- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాభారతంలో నా ఫేవరేట్ క్యారెక్టర్ అదే.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల(Madiga Community Employees) సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ సామాజికవర్గ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగజాతి ఎంతో పోరాటం చేసిందని కొనియాడారు. ఈ పోరాటంలో అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. స్వయంగా తాను ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ సమస్యను ప్రత్యక్ష్యంగా చూస్తూ వచ్చానని తెలిపారు. ఈ న్యాయమైన హక్కుపై మొదటినుంచి కూడా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమస్యపై పోరాటం చేసినందుకు గతంలో తనను అసెంబ్లీ నుంచి గెంటేశారని తెలిపారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను.. నాతో పాటు అనేకమంది వర్గీకరణ కోసం పోరాటం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ కోసం ప్రకటన చేసిన తొలిరాష్ట్రం తెలంగాణే. వర్గీకరణ అంశంలో మాదిగల వైపు న్యాయం ఉంది. ఇందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. అందుకే చివరి వరకు మీకోసం స్టాండ్ తీసుకున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది ప్రజలు అందరూ కోరుకుంటే వచ్చిన ప్రభుత్వమని అన్నారు. అంతా సమిష్టిగా కష్టపడి బీఆర్ఎస్‌ను గద్దె దింపినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము మాటలతో కాడు.. కమిట్‌మెంట్‌తో గెలిచామని స్పష్టం చేశారు.
అందుకే విద్యాశాఖ తీసుకున్నా..
రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి విద్యను దగ్గరచేయడానికే స్వయంగా తానే విద్యాశాఖ తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖను ప్రక్షాళన చేశాం. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చాం.. బ్యాగులతో కూడిన కిట్ ఇవ్వబోతున్నాం.. హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం. రాష్ట్రంలో పేదరికమనే కారణం చేత ఎవరూ విద్యకు దూరం కాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పుకొచ్చారు.
మాదిగల అభివృద్ధి నా బాధ్యత..
మహాభారతంలో నా ఫేవరేట్ క్యారెక్టర్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్రధర్మం పాటిస్తున్నాం. బర్బరీకుడు బలహీన పక్షాల వైపు నిలబడ్డ వ్యక్తి. అందుకే మాదిగల విషయంలో వర్గీకరణ కోసం బర్బరీకుడిలా పనిచేశా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ప్రగతి ప్రణాళికలో ఉద్యోగులంతా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ఆర్థిక వెసులుబాటు కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయినా మాదిగలకు మెరుగైన విద్య, రాజకీయంగా అవకాశాలు కల్పించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.






