కేరళను చూస్తే అసూయ కలుగుతోంది.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేరళను చూస్తే అసూయ కలుగుతోంది.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేరళలోని అలెప్పీలో కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారని ప్రశంసించారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. 2006లో వేణుగోపాల్ ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థినీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.

‘ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు. దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది. దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 10వ, 12వ తరగతి తర్వాత.. సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తా. అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ. అందుకే అందరితో పాటు నాకు కూడా కేరళను చూస్తే అసూయగా ఉంది’ అని రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.

‘తెలంగాణలో కూడా విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున దృషి సారించాం. విద్యకున్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతున్నా. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఏది చేసినా విద్య మనకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగాపెట్టుకున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించాం. కేవలం 55 రోజుల్లో 11055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం. వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించబోతున్నాం. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మించబోతున్నాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

త్వరలో కేరళ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి. 2026లో జరిగే ఎన్నికలు కేవ కేరళ అసెంబ్లీ ఎన్నికలుగా భావించకండి. అవి 2029లో దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు అవుతాయి. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారు. అదే బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ పౌరుల నుంచి ఓటు హక్కును కొల్లగొడుతున్నారు. 2029లో జరగబోయే లోక్ సభ ఎన్నికలు ఈ రెండు శక్తుల మధ్య జరగబోతున్నాయి. దేశంలోని యువత ఈ తేడాను గమనించాలని పిలుపునిచ్చారు.

Next Story