- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడంగల్ ప్రగతికి సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. 10 లైన్ల రేడియల్ రోడ్డు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రగతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

దిశ, కొడంగల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రగతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 33 రేడియల్ రోడ్ల నెట్‌వర్క్‌ను జిల్లాలకు విస్తరిస్తూ, కొడంగల్‌ను పారిశ్రామిక, విద్యా హబ్‌గా మార్చాలనేది సీఎం రేవంత్ రెడ్డి సుదూర విజన్. ఇందులో భాగంగానే శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ 80 కిలోమీటర్ల భారీ రేడియల్ రోడ్డుకు రూపకల్పన చేశారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో కొడంగల్ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను అద్భుతంగా మార్చబోతున్నది.
ఓఆర్ఆర్ నెట్‌వర్క్‌లో 'మకుటం'.. సీఎం విజన్ ఏంటి?
గతంలో రేడియల్ రోడ్లు కేవలం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ నియంత్రణ కోసం మాత్రమే పరిమితమయ్యాయి. కానీ, ఈ 10 లైన్ల (300 అడుగుల) రహదారిని ఒక అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌గా మార్చాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లగచర్లలో ప్రతిపాదించిన 2000-3000 ఎకరాల పారిశ్రామిక వాడ, హకీంపేట్‌లో రాబోయే అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌లను కలుపుతూ సాగే ఈ రహదారి ద్వారా, స్థానిక యువతకు ఉన్నత చదువులు, ఉపాధిని ఒకేచోట చేర్చాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం. ఈ రహదారి పూర్తయితే, కొడంగల్ నియోజకవర్గం నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి 167 (ఎన్ హెచ్-167) తో హై-స్పీడ్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్..
తెలంగాణలో ఉన్న 33 రేడియల్ రోడ్లలో చాలావరకు 4 లేదా 6 లైన్లు మాత్రమే ఉన్నాయి. కానీ, దుద్యాల్ రేడియల్ రోడ్డును ఏకంగా 10 లైన్లుగా నిర్మించాలని సీఎం ప్రత్యేక ఆసక్తితో నిర్ణయించారు. 10 లైన్ల వెడల్పుతో, ఎక్కడా సిగ్నల్స్ లేకుండా సాగే ఈ ప్రయాణం వల్ల గంటన్నర ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గుతుంది.
- రోడ్డు మధ్యలో, ఇరువైపులా ఆహ్లాదకరమైన గ్రీన్ బెల్ట్ (మొక్కలు) పెంచడానికి ప్లాన్.
- భారీ రవాణా వాహనాలకు, సాధారణ ప్రయాణికులకు విడివిడిగా సురక్షితమైన లైన్లు.
- సర్వీస్ రోడ్ల ద్వారా స్థానిక గ్రామాల ప్రజలకు ప్రయాణంలో గరిష్ట రక్షణ కల్పించడం.
కొడంగల్ భవిష్యత్తు మార్చే 'ప్రశాంత ప్రగతి'!
- ట్రాఫిక్ లేని ప్రయాణం.. ఆర్ఆర్ఆర్ (ఆర్ఆర్ఆర్) తో అద్భుత అనుసంధానం. ఈ రేడియల్ రోడ్డు భవిష్యత్తులో రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)ను కూడా కలుపుతుంది. దీనివల్ల కొడంగల్, దుద్యాల్ ప్రజలు రాష్ట్రంలోని ఏ మూలకైనా హైదరాబాద్ నగర ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా అత్యంత సులభంగా చేరుకోవచ్చు.
ఫార్మా విలేజ్' కు పర్యావరణ అనుకూల తోడ్పాటు!
ప్రభుత్వం దుద్యాల్ మండల పరిధిలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక 'ఫార్మా విలేజ్' కు ఈ రోడ్డే వెన్నెముక. అంతర్జాతీయ ప్రమాణాలతో, కాలుష్య రహిత పద్ధతుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రవాణా పరంగా ఈ 10 లైన్ల రహదారి ఎంతో అనుకూలంగా మారబోతోంది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద లాజిస్టిక్ పార్కులు, సురక్షితమైన గిడ్డంగులు, షాపింగ్ మాల్స్, ఆధునిక నివాస గృహాలు వెలిసే అవకాశం ఉంది. దీంతో దుద్యాల్ మండలం హైదరాబాద్ నగరానికి ఒక అందమైన 'శాటిలైట్ సిటీ' గా రూపాంతరం చెందబోతున్నది. సీఎం విజన్ ప్రకారం.. మన ప్రాంత యువత బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సొంత నియోజకవర్గంలోనే ఐటీ, ఫార్మా రంగాల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు లభించనున్నాయి. రోడ్డు పొడవునా వాణిజ్య కేంద్రాలు రానుండడంతో భూముల ధరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది స్థానిక రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుంది.






