CM Revanth Reddy: కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్.. బీఆర్ఎస్ తాజా పరిణామాలపై హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-09-03 09:48:50  IST  )

బీఆర్ఎస్ తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy:  కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్.. బీఆర్ఎస్ తాజా పరిణామాలపై హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో/మహబూబ్‌నగర్ బ్యూరో : బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపురించిందని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరినీ రాజకీయంగా బతకనివ్వమని, ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపినవారు ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చస్తున్నారని, యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములలో ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం అనంతరం మాట్లాడుతూ.. హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నాడని కవిత చేసి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక తానెందుకు ఉంటాను? తనకు అంత సమయంలేదన్నారు. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని అన్నారు. వాళ్లు చేసిన పాపం ఊరికే పోదని, అనుభవించక తప్పదన్నారు.

తొలి ముద్ద పాలమూరుకే..

వలసల జిల్లా పాలమూరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఏది వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకేనని చెప్పారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ప్రాజెక్టును తొక్కిపెట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని విమర్శించారు. తాము వచ్చాక రూ. 4వేల కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముందుకు వెళ్లాలని చూస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు భూసేకరణకు ఎకరానికి రూ. 11 లక్షలు ఇచ్చామని, ఇక్కడ రూ.14 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినా అయినా సరిపోవడం లేదంటున్నారు. రైతులతో మాట్లాడాలని వెంటనే నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో భూ నిర్వాసితులకు నష్టం జరగనివ్వమన్నారు. ఇక్కడి ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేయకపోతే మళ్లీ ఇంకెవరూ పూర్తి చేసేవారు రారన్నారు. కలెక్టర్లే రైతుల వద్దకు వెళ్లి వారిని ఒప్పించాలని సూచించారు.

మన పేదరికాన్ని ఎగ్జిబిషన్‌గా చూపారు..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఏ నియోజకవర్గంలో లేవో వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సీఎం ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో ట్రిబుల్ ఐటీ నిర్మించుకుందామని అన్నారు. ఒక నాడు మన కరువును, వెనుకబాటుతనాన్ని చూపించేందుకు విదేశీ వ్యక్తులను ముఖ్యమంత్రులు పాలమూరుకు తీసుకువచ్చేవారని, మన పేదరికం ఒక ఎగ్జిబిషన్‌గా ఉండేదని పేర్కొన్నారు. కానీ భవిష్యత్‌లో మన అభివృద్ధిని చూసేందుకు విదేశీ బృందాలు రావాలని సీఎం ఆకాంక్షించారు.

Next Story