- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలో ప్రతి 3 టీకాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలో ఎలీ లిల్లీ (Eli Lilly) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఇందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమని చెప్పారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబు, జయేశ్ రంజన్, పాలుపంచుకున్నారని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) దిశగా మేము వేసిన మరొక ముఖ్యమైన అడుగు అని అన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్..
ఎలీ లిల్లీ సంస్థ లీడర్ షిప్‌ను, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు-పెట్టుబడిదారులు, ప్రపంచ శ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం.. ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో టాలెంట్ ఉంది, లీడర్‌షిప్ ఉంది, విజన్ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు.
భారతదేశ లైఫ్ సైన్సెస్ (Life Sciences) రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయన్నారు. 2 వందలకు పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. భారత్‌లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాల్లో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ రోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్ సైన్సెస్ రంగంలో మేము మరో మెట్టుకు చేరుకున్నామని చెప్పారు. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాల్లో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్-ఛేంజర్‌గా నిలిచిపోతుందని తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్..
నేను, మా ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు.. కేవలం హైదరాబాద్‌లో నివసించడం, పనిచేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీరు మా కుటుంబ సభ్యులుగా మారారని చెప్పుకొచ్చారు. మీ సహకారంతో, తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. మనమందరం కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దాం, ప్రజల జీవితాలను మారుద్దాం, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్ నిర్వచిద్దామని పిలుపునిచ్చారు.






