సీఎం రేవంత్ రెడ్డి Vs సీఎం విజయన్: తెలంగాణలో పొత్తుల కుంపటి!

by Kema Shiva Kumar |

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి Vs సీఎం విజయన్: తెలంగాణలో పొత్తుల కుంపటి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టు నేతల్లో కాకపుట్టిస్తున్నాయి. అక్కడి సీఎం పినరయి విజయన్ పై చేసిన ఆరోపణలు, విమర్శలకు వామపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. యూడీఎఫ్ అభ్యర్థుల తరఫున కేరళంలో రెండు రోజులు పాటు సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రోడ్ షోలు, కార్నర్ షోలు నిర్వహించారు. యూడీఎఫ్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబపాలన, అవినీతి, అస‌మ‌ర్థ పాల‌న విష‌యంలో పిన‌రయి విజ‌య‌న్‌, కేసీఆర్‌ల మ‌ధ్య అనేక పోలిక‌లు ఉన్నాయ‌ని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్‌కు ఓటువేస్తే బీజేపీకి ఓటు వేసిన‌ట్టేన‌ని, ఎల్డీఎఫ్‌, బీజేపీల మ‌ధ్య ఒప్పందాలు ఉన్నాయ‌ని, ఆ రెండు పార్టీల మధ్య సైలెంట్ అండ‌ర్‌ స్టాండింగ్ ఉంద‌ని సంచలన కామెంట్స్ చేశారు. అందుకే వారిపై ఎలాంటి కేసులు లేవని, దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, విజయన్​సర్కార్ పై ఈగ వాలనీయదని పేర్కొన్నారు.

ఖండించిన కమ్యూనిస్టు నేతలు

కేరళం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. సీఎం అపరిచితుడిగా, మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సీపీఎం, బీజేపీల గురించి దేశ ప్రజలకు తెలుసని, తెలియకపోతే రేవంత్ మానసిక స్థితిపై టెస్టు చేయించుకోవాలన్నారు. కేరళంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయని, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. అలాగే కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మె్ల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్‌ వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుందన్నారు.

పొత్తులపై ప్రభావం?

కేరళంలోని ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఐ భాగస్వామిగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కు సీపీఐ మిత్రపక్షంగా ఉంది. కానీ, సీపీఎంతో కాంగ్రెస్ కు రాజకీయపరంగా అంత అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీపీఎం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. పినరయి విజయన్ పై చేసిన ఆరోపణలతో రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తులు, మిత్రపక్షాలుగా కలిసి నడుస్తాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత ఘటనపై కేరళం సీఎం విజయన్‌ రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ అదే స్థాయిలో పినరయి విజయన్‌పై విమర్శలు చేశారనే చర్చ నడుస్తున్నది. కేరళం ప్రచారంలో సీఎం రేవంత్ ఈ స్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, విజయన్ పై విరుచుకుపడతారని అనుకోలేదని చెబుతున్నారు. ఆయన విమర్శలు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సయోధ్యకు గండికొట్టే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story