CM Revanth Reddy: లోకల్ సెంటిమెంట్ గౌరవించండి.. ఆలయాల అభివృద్ధి సమీక్షలో సీఎం కీలక సూచన

by Prasad Jukanti |   (  Updated:2025-09-08 10:23:47  IST  )

అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

CM Revanth Reddy: లోకల్ సెంటిమెంట్ గౌరవించండి.. ఆలయాల అభివృద్ధి సమీక్షలో సీఎం కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మేడారం (Medaram), బాసర (Basara) ఆలయాల అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ వారం మేడారంకు వస్తా:

మేడారం మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం.. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి (CM Medaram Tour) క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు.

Next Story