- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా పోలీసు స్టేషన్ షురూ.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీసు స్టేషన్ తోడయ్యింది. హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇప్పుడు పోలీసు స్టేషన్ తోడయ్యింది. హైడ్రా కార్యాలయం బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభిస్తున్నారు. డిజాస్టర్, ఫైర్ విభాగాల మాదిరే సొంతంగా పోలీసు స్టేషన్ తోడవ్వడంతో హైడ్రా కార్యకలాపాలకు మరింత బలం సమకూరనుంది. ఈ పోలీసు స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ పి. తిరుమల్ నియమితులయ్యారు. ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ప్రస్తుతానికి ఈ పోలీసు స్టేషన్‌కు కేటాయించారు. జీ+2గా నిర్మాణమైన ఈ పోలీసు స్టేషన్‌లో 10,500ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
హైడ్రా పోలీసు స్టేషన్‌లోనే విచారణ..
ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీసు స్టేషన్ క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంది. ఈ పోలీసు స్టేషన్‌కు సమకూరిన అధికారాల మేరకు కేసులు నమోదు చేసి వారిని అరెస్టు కూడా చేస్తుంది. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా కేసులు బుక్ చేస్తుంది. మట్టిని తరలించే వాహనదారులపైనే కాకుండా.. మట్టిని తరలించేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యక్తితో పాటు.. ఆ మట్టి ఏ నిర్మాణ సంస్థకు చెందినదో తెలుసుకుని వారిపైన కూడా హైడ్రా పోలీసు స్టేషన్ కేసులు నమోదు చేస్తుంది. చెరువుల్లోకి మురుగునీరును నేరుగా వదిలిన వారిపైనా కేసులు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
సూత్రదారులెవరో తేల్చనుంది..
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల వెనుక ఉన్న సూత్రదారులు ఎవరో హైడ్రా పోలీసు స్టేషన్ తేల్చనుంది. పేదవాళ్ల రూపంలో గుడిసెలు వేయించి.. తర్వాత కాజేసే బడా వ్యక్తుల భరతం పడుతుంది. నకిలీ పత్రాలు సృష్టించి లే ఔట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలనుకునేవారి గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేస్తుంది. వాల్టా యాక్టు, ఫైర్ చట్టాల ఉలంఘనులను నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తుంది. లే ఔట్లలో రహదారులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని ప్రకటనల హోర్డింగుల యజమానులను నియంత్రిస్తుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుంది. అక్రమ కట్టడాల నియంత్రణలో భాగంగా చర్యలు తీసుకోనుంది.
సామాన్యులకు అండగా ఉంటుంది..
లే ఔట్లలో కొన్ని ప్లాట్లు కొని.. పక్కన ఉన్న వారి ప్లాట్లు కలిపేసుకుని పాత లే ఔట్లను చెరపట్టిన వారిపై హైడ్రా పోలీసు స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తుంది. లే ఔట్‌లో రహదారులు, పార్కులతో పాటు.. సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి న్యాయం జరిగేలా చూస్తుంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థతిని తెలుసుకుని.. బాధ్యులపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల భూములను, పలు చెరువులు, పార్కులు, నాలాలను కాపాడింది. ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్లలో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడా కేసులన్నిటిని హైడ్రా పోలీసు స్టేషన్‌కు బదిలీ అవుతాయి. సమస్య మూలాల్లోకి వెళ్లి ఆక్రమణదారులను సరైన ఆధారాలతో జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీసు స్టేషన్ పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
వెబ్ సైట్ సైతం
హైడ్రాకు సంబంధించిన వెబ్ సైట్ రెడీ చేశారు. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు. పోలీసు స్టేషన్ తో పాటు వెబ్ సైట్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఇక్కడ కుదరదు: కమిషనర్ ఏవీ.రంగనాథ్
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులన్నీ పార్కుల కబ్జా, రోడ్లు బంద్, ఏండ్ల తరబడి సమస్యలు ఎక్కడికక్కడే పెండింగ్ లో ఉన్నాయి. కబ్జాదారులు, వారికి సహకరించిన అధికారులపైన కేసులు నమోదు చేస్తే రాజకీయపరమైన ఒత్తిళ్లు వస్తున్నాయని, హైడ్రా పోలీసు స్టేషన్‌లో ఇలాంటివి కుదరవని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పారు. కేసుల పూర్వపరాలు తెలుసుకుని కబ్జాదారులు ఎంతటివారైనా ఒదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.






