‘ప్రాణహిత’ స్పీడప్..మహారాష్ట్రతో సీఎం రేవంత్ సంప్రదింపులు !

by velandi.Saikiran |

రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నో ఏండ్లుగా నిలిచిపోయిన ప్రాణహిత ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకోనుంది.

‘ప్రాణహిత’ స్పీడప్..మహారాష్ట్రతో  సీఎం రేవంత్ సంప్రదింపులు !
X

‘ప్రాణహిత’ స్పీడప్..

- తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు జలాలు

- మహారాష్ట్రతో సంప్రదింపులు జరపనున్న సీఎం రేవంత్ రెడ్డి

- 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పించేందుకు ప్రయత్నం

- నేడు తుమ్మిడిహెట్టి పర్యటనకు మంత్రులు జూపల్లి, గడ్డం వివేక్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నో ఏండ్లుగా నిలిచిపోయిన ప్రాణహిత ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకోనుంది. మహారాష్ట్రతో ఉన్న వివాదాల కారణంగా గతంలో నిలిచిపోయిన తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ప్రారంభించింది. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజ్‌కు నీటిని తరలించే ప్రణాళికపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలతోనూ సీఎం రేవంత్ ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది.త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, అవసరమైతే కేంద్రం మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని కసరత్తు చేస్తున్నది. సీఎం ఢిల్లీ టూర్ ఎట్టకేలకు ముగియడంతో వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక స్థాయిలో సంప్రదింపులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

150 మీటర్ల ఎత్తుపై ఫోకస్

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మాణ ఎత్తుపై గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. మహారాష్ట్ర అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎత్తు విషయంలో అంగీకారం కుదిరితే ప్రాణహిత జలాలను సుందిళ్లకు తరలించే మార్గం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాణహిత అంశాన్ని ఇక అధికారులకే పరిమితం చేయకుండా సీఎం రేవంత్‌ స్వయంగా మానిటర్ చేస్తున్నారు. రాష్ట్రానికి నీటి అవసరాలు, ఉత్తర తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు. అవసరమైతే కేంద్ర జలశక్తి శాఖ సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం వివరాలు అందించినట్లు సమాచారం. అంతేకాకుండా.. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయం సైతం ఈ అంశంలో తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.

తుమ్మిడిహెట్టి టు సుందిళ్ల..

తుమ్మిడిహెట్టి వద్ద గత వైఎస్సార్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టింది. కాల్వల నిర్మాణం సైతం కొంత మేర జరిగాయి. అయితే.. ఆ తదుపరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసింది. ఆ లొకేషన్‌ను అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చింది. దాంతో ప్రాణహిత-చేవెళ్లకు బ్రేక్ పడింది. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా అయినా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్మించి గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి వరకు నీటిని తరలించాలని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ నుంచి తొలుత సుందిళ్లకు జలాలను తరలించి.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టినప్పటికీ గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి ఆశించిన మేర నీటిని తరలించే అవకాశం లేకుండా పోయింది.

దాంతో తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి అలైన్‌మెంట్‌లో మైలారం దాకా 71.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ 2015కి ముందే పూర్తయింది. మైలారం వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని పంపింగ్‌ చేయాలనేది గతంలోని అలైన్‌మెంట్‌లో ఉన్నది. మైలారం నుంచి సుందిళ్లకు నీటిని తరలించి.. అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోయడం మేలని నిపుణులు తాజాగా సూచించగా.. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అలైన్‌మెంట్‌పై ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. ఇక తుమ్మిడిహెట్టిని 150 మీటర్ల ఎత్తుతో కట్టడానికి వీలుగా సమ్మతి కోరుతూ ఇప్పటికే మహారాష్ట్ర సీఎంకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సమ్మతి లభిస్తే తుమ్మిడిహెట్టి డీపీఆర్‌కు తుదిరూపు ఇచ్చి.. అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)ని ఆశ్రయించనున్నారు. వారం రోజుల్లోపే సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో భేటీ కానున్నట్లు తెలిసింది.

నేడు తుమ్మిడిహెట్టిలో మంత్రుల పర్యటన

ప్రాజెక్టు పురోగతిపై గ్రౌండ్‌ రియాలిటీ తెలుసుకునేందుకు నేడు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులు, నిర్మాణ అవకాశాలు, నీటి లభ్యతపై అధికారులు వారికి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పర్యటన అనంతరం ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. వీరి పర్యటన అనంతరం వెంటనే సీఎం మహారాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి.. ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Next Story