- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: విద్యాసంస్థల యాజమాన్యాలకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్
‘తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తున్నారు. లక్షల ఫీజులు కట్టి మీకు అప్పగిస్తున్నారు. కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను స్కూళ్లు, కాలేజీల్లో చేర్పిస్తున్నారు. లక్షల ఫీజులు కట్టి మీకు అప్పగిస్తున్నారు. కేవలం చదువు చెబితే చాలన్నట్టు యాజమాన్యాలు, అధ్యాపకులు భావించడం సరికాదు. వాటిని నియంత్రించడంలో యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది. కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే ఇక నుంచి వాటి యాజమాన్యాలపైనా కూడా కేసులు నమోదు చేయండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీన్యాబ్), తెలంగాణ వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యాజమాన్యాలు, అధ్యాపకులు విద్యార్థుల నడవడికను సైతం గమనించాల్సి ఉంటుందని సూచించారు. డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలతో నార్కోటిక్స్ బ్యూరో ఒక సమావేశం నిర్వహించాలని అన్నారు.
డ్రగ్స్‌పై ఈగల్ కన్ను..
ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో ఇకనుంచి రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క మెలిచినా ఇట్టే కనిపెట్టేలా ‘ఈగల్’(ఎలైట్ ఆక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. డ్రగ్స్‌తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలని.. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తామని హెచ్చరించారు. ‘రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాల్లో ఒక్క గంజాయి మొక్క మొలవొద్దు. ఒక్క గంజాయి మొక్క మొలిచినా ఈ ఈగల్ (గద్ద) ఇట్టే పట్టేస్తుంది. ఈ గద్ద ఈరోజు నుంచే పనిచేస్తుంది’ అని సీఎం చెప్పారు. ఐటీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ గంజాయికో, డ్రగ్స్ హబ్‌గా మారితే అంతా విఫలమైనట్టేనని అన్నారు. యువతను సరైన దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైన కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి, మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానకరమని అన్నారు. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారని.. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాలు, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.
దేశంలో 68 శాతం యువత..
దేశవ్యాప్తంగా 140 కోట్ల జనాభా ఉన్న ఉంటే.. అందులో 68 శాతం యువత ఉందని సీఎం రేవంత్ చెప్పారు. ఐటీతో సహా అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళుతుంటే దెబ్బతీయడానికి, దేశాన్ని నిర్వీర్యం చేయడానికి ఇలాంటి డ్రగ్స్ మహమ్మారితో యువతను బలిగొనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ రక్షణలో ముందు వరుసలో నిలుచున్న పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ బారిన పడి యువత నిర్వీర్యమైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడడంలో సైన్యంలో ముందు వరుసలో ఉండే పంజాబ్.. ఇప్పుడు డ్రగ్స్ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నదని అన్నారు. నల్లమల నుంచి వచ్చిన తాను జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని.. తనలాగే విజయ్ దేవరకొండ నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారని సీఎం తెలిపారు. కష్టం, కమిట్మెంట్ లేకుండా ఈ స్థాయిలో రాణించలేరని.. అందుకే మాదకద్రవ్యాల బారిన పడకుండా.. వాటి నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.
యువత కోసం క్రీడాపాలసీ..
యువతను సరైన దిశలో నడిపించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో క్రీడా పాలసీని తెచ్చామని.. నైపుణ్యాలను మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని రేవంత్ చెప్పారు. రేపటి రోజున ఎవరైనా క్రీడల్లో శిక్షణ తీసుకోవాలంటే తెలంగాణ వెళ్లాలన్న పరిస్థితి రావాలన్నారు. తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే శక్తి, యుక్తి దేశంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, సినీనటులు రాంచరణ్, విజయ్ దేవరకొండ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ జితేందర్, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యాతోపాటు అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సహా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు.
యాంటి నార్కోటిక్ టీం 50మందితో ప్రారంభించాం: డైరెక్టర్ టీజీ నాబ్ సందీప్ శాండిల్యా
2024జనవరిలో యాంటి నార్కోటిక్ టీం మొదటగా 50మందితో ప్రారంభించాం. 20×20 అడుగుల రూంలో, సింగల్ వెహికల్‌తో విధులు నిర్వహించాం. నేడు 17 నెలల్లో దేశంలో నెం 1గా అవతరించాం. బెస్ట్ నార్కో లాబ్ కలిగి ఉన్నాం. హెయిర్ శాంపిల్స్‌తో కూడా డ్రగ్స్ టెస్ట్ చేయొచ్చు. డ్రగ్స్ తీసుకున్న 3 నెలల తరువాత డ్రగ్స్ పాజివిట్ గుర్తించవచ్చు. 42 డిఎడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. దశముఖ్ కార్యక్రమంతో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నాం. 1.30 లక్షల మంది ఎన్సీసీ, 70వేల మంది ఎన్ఎస్ఎస్ కేడెట్లు ఉన్నారు. వారందరూ డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలి.
మనమే సోల్జర్స్ అవుదాం : రామ్ చరణ్
ఈ ప్రోగ్రాం చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడిని. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ క్కు బానిస అవుతున్నట్లు వస్తున్న వార్తలు బాధను కలిగిస్తున్నాయి. నేను ఒక తండ్రిగా చెబుతున్నా.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్స్‌కు దూరంగా ఉంచండి. జీవితంలో ఏదో సాధించడానికి కృషి చేయాలి.. అప్పుడే ఇతరత్రా వాటి మీదకు దృష్టి వెళ్లదు. తప్పకుండా డ్రగ్స్‌పై అందరం సోల్జర్ లా పోరాటం చేద్దాం.
ఎవరూ డ్రగ్స్‌కి బానిసవ్వద్దు: విజయ్ దేవరకొండ
మన అందరికీ హెల్త్ ముఖ్యం. తల్లిదండ్రులు గౌరవ పడేలా ఉండాలి. ఎవరూ డ్రగ్స్‌కి బానిసవ్వద్దు. తీసుకునే ప్రతి నిర్ణయం మనల్ని ప్రభావితం చేస్తుంది. మన యూతే మన పవర్. మనం నెంబర్ 1గా ఉంటే మనదేశం నెంబర్ 1 అవుతుంది. అలవాటు చేసే బ్యాచ్ ఉంటుంది, వారి నుంచి దూరంగా ఉండాలి. మంచి వర్కవుట్ చేయాలి. నచ్చిన పని చేసి అది సక్సస్ అయినప్పడు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. లక్ష్యాన్ని ఛేజించేలా కసిగా ఉండాలి.
డ్రగ్స్ తీసుకుంటే బహిష్కరణ : దిల్ రాజు
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ విని యోగాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలలి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్నవారిని బహిష్కరించే విధానం అమలులో ఉంది. అదే తరహాలో టాలీవుడ్‌లో కూడా ఇటువంటి నిర్ణయాన్ని త్వరలో అమలు చేసేందుకు చర్చలు జరుపుతాం. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో సంప్రదింపులు జరిపి, అధికారిక నిర్ణయం తీసుకుంటాం.






