- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొలువుల పండుగలో నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమైందంటే..?
నిరుద్యోగుల కల సాకారమవుతున్న వేళ, రాష్ట్ర రాజధానిలోని శిల్పకళా వేదిక వేదికగా 'కొలువుల పండుగ' వైభవంగా జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగుల కల సాకారమవుతున్న వేళ, రాష్ట్ర రాజధానిలోని శిల్పకళా వేదిక వేదికగా 'కొలువుల పండుగ' వైభవంగా జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రూప్-3 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. టీజీపీఎస్సీ (TGPSSC) ద్వారా 25 ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 1370 మంది విజేతలకు ఈ సందర్భంగా పోస్టింగ్ ఆర్డర్లు లభించాయి.
నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చమత్కరిస్తూ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. "మిమ్మల్ని చూస్తుంటే చాలా మంది పెళ్లి కాని యువకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు చేతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి, పెళ్లి మార్కెట్‌లో మీ 'ధర' (డిమాండ్) బాగానే పలుకుతుంది" అని సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలకు అభ్యర్థులతో పాటు హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.
తల్లిదండ్రుల బాధ్యతపై గట్టి హెచ్చరిక
వినోదంతో పాటు అంతే బాధ్యతాయుతమైన సందేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కొందరు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారన్న అంశంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కీలక హెచ్చరిక చేశారు. "కొంతమంది పెళ్లి చేసుకుని, అత్తగారింటికే ప్రాధాన్యత ఇస్తారు. నిన్నటి వరకు కష్టపడిన తల్లిదండ్రులను దూరం పెడతారు. కానీ నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నాను.. తల్లిదండ్రులను సరిగా చూసుకోని పక్షంలో, మీ జీతం నుంచి 15 శాతం కోత విధించి నేరుగా వారి ఖాతాలో వేస్తాం" అని సీఎం హెచ్చరించారు.
విజేతల్లో నూతనోత్సాహం
ప్రభుత్వ ఉద్యోగం సాధించామనే తృప్తి ఒకవైపు, స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రం తీసుకోవడం మరోవైపు అభ్యర్థుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






