మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్ సంచలన ప్రకటన

by Naga Rani Yarlagadda |

పార్లమెంట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంతో దేశానికి పెనుప్రమాదం తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం ఉదయం కాంగ్రెస్ పెద్దలను కలిసి బిల్లు వీగిపోవడంపై ధన్యవాదాలు తెలిపారు. మధ్యాహ్నం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక ప్రకటన చేశారు. బిల్లు వీగిపోవడం రాజకీయ ఓటమి కానేకాదని, బీజేపీ విధానాలకు జరిగిన ఓటమి అని అభివర్ణించారు. ఎన్డీఏ మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని, మహిళా రిజర్వేషన్లను చిన్న సవరణలతో అమలు చేయవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చివేసి ఉండేదన్నారు. మహిళా రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉందని, తాము అందుకు వ్యతిరేకం కాదని సీఎం స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నాది..

రాజకీయ అధికారం బీజేపీ దగ్గరున్నా.. ఆర్థిక వనరులు మాత్రం రాష్ట్రాల నుంచే అందుతున్నాయని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల లోపు 2023 నాటి మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే.. అందుకు మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమని, సోమవారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే ప్రవేశపెడితే ఇండికూటమి ఏకగ్రీవంగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అందుకోసం దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై తమకూ చిత్తశుద్ధి ఉందని, ప్రజల్లో ఎవరికి మద్దతు ఉందో ప్రజాక్షేత్రంలో తేలుతుందన్నారు. కానీ మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలు ఉండాలని డిమాండ్ చేశారు. సోమవారమే పార్లమెంటులో ఆమోదించి, సోమవారం నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.

మా మధ్య చిచ్చు పెట్టకండి..

డీలిమిటేషన్ పేరుతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. తమకు రాజకీయాలకంటే దేశమే ముఖ్యమని తెలిపారు. మహిళా రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఓటు హక్కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ లాంటి గొప్పనేతలు దేశాన్ని నడిపించారని, బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇప్పటివరకూ మహిళలకు దక్కలేదని పోల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. డీలిమిటేషన్ తో పార్లమెంట్ సీట్లను 850కు పెంచి.. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని పెద్దకుట్ర పన్నిందని రేవంత్ ఆరోపించారు.

Next Story