ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం

by Gantepaka Srikanth |

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్​శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.

నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. తద్వారా నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన ఏడు కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్ల ను పిలువాలని రేవంత్​రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్​ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్​రెడ్డి, సీఎంవో అధికారి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story