రాతి కట్టడాలతో ఆలయాలు నిర్మించండి: అధికారులకు CM రేవంత్ ఆదేశం

by Gantepaka Srikanth |

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాతి కట్టడాలతో ఆలయాలు నిర్మించండి: అధికారులకు CM రేవంత్ ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆలయాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కొడంగల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలను సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో కొడంగల్‌లోని చారిత్రక శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆలయ ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహ స్వామి దేవాలయం, గర్భగుడి, మహా మండపం డిజైన్లను సీఎంకు చూపించారు. దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. అనంతరం సీఎం ఆయా డిజైన్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాస రాజు, కార్యదర్శి మాణిక్ రాజ్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story