వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 04:24:55  IST  )

హయత్ నగర్‌ (Hayathnagar)లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌ (Premchand)పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.

వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: హయత్ నగర్‌ (Hayathnagar)లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్‌ (Premchand)పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ ఉదయం ఆ వార్తను వివిధ పత్రికల్లో చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎంవో (CMO) అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని సూచించారు. అదేవిధంగా బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు బాధిత కుటుంబాన్ని వెంటనే కలవాలని, వారి బాగోగులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు గత మూడేళ్లుగా హయత్‌నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్‌ పుట్టుకతో మూగవాడు. మంగళవారం ఉదయం తండ్రి మేస్త్రీ పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో నీళ్లు పడుతున్నది. ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న ప్రేమ్‌చంద్‌పై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమేసి బాలుడిని రక్షించారు. అనంతరం అతడిని నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిలోఫర్‌కు తీసుకెళ్లగా ప్రస్తుతం అత్యవసర వార్డులో చికిత్స అందజేస్తున్నారు.

Next Story