మరో వ్యక్తికి CM రేవంత్ రెడ్డి చేయూత

by Gantepaka Srikanth |

రోడ్డుపై వెళుతున్నప్పుడు ఒక వాహనం బలంగా ఢీ కొట్టడంలో రెండు కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయూతనందించారు.

మరో వ్యక్తికి CM రేవంత్ రెడ్డి చేయూత
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుపై వెళుతున్నప్పుడు ఒక వాహనం బలంగా ఢీ కొట్టడంలో రెండు కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయూతనందించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. మూడు రోజుల కిందట వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్(SP Ravula Giridhar) నిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు అక్కడ రెండు కాళ్లు, దడవ ఎముక విరిగిన ఒక యువకుడు దయనీయ స్థితిలో ఉన్న వ్యక్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లాకు చెందిన కరీముల్లా చెర్లపల్లిలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఒక వాహనం ఢీ కొట్టడంతో రెండు కాళ్లు విరగడమే కాకుండా పలు గాయాలతో అపస్మార స్థితిలోకి వెళ్లాడు.

తర్వాత కరీముల్లా(Karimulla)ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా విరిగిన కాలికి డాక్టర్ లలిత్ మోహన్ ఆపరేషన్ చేశారు. ఈ వివరాలను తెలుసుకున్న వనపర్తి ఎస్పీ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించారు. సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి ఆ వ్యక్తి చికిత్సకయ్యే ఖర్చు రూ. 2.50 లక్షల రూపాయల మేరకు ఎల్ఓసీ జారీ చేయాలని ఆదేశించారు. చికిత్సకు అయిన ఖర్చును ఎలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళన పడుతున్న సమయంలో మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందించారని పేర్కొంటూ, ముఖ్యమంత్రికి కరీముల్లా కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

Next Story