- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లు.. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ హాట్ కామెంట్స్
బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్రపతి తమకు అపాయింట్ మెంట్ నిరాకరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే నాలుగు నెలలుగా ఆ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోగా దానిని రాష్ట్రపతికి పంపడం వల్ల సమస్య మరింత జటిలం అయిందన్నారు. వీటిని ఆమోదం వస్తే తప్ప చట్టబద్ధంగా చెల్లుబాటు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదని దీంతో పార్టీ పరంగా ఇవ్వాలా మరేదైనా ఉపాయం ఉందో త్వరలోనే హైదరాబాద్ లో పీఏసీ సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామన్నారు. పది రోజుల క్రితమే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరాం. ఆగస్టు 6,7 తేదీల్లో మీరు ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇచ్చినా మేము ఢిల్లీలో అందుబాటులోనే ఉంటామని రాష్ట్రపతికి సమాచారం ఇచ్చాం. కానీ మేము అపాయింట్ మెంట్ అడిగిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా రాష్ట్రపతిని కలిశారు. వీరు ఏం మాట్లాడుకున్నారో తెలిదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో మా మంత్రి వర్గం, మా పార్టీ అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ రాకుండా చేశారనే నిర్ధరణకు వచ్చామన్నారు. రాష్ట్రపతిని మేము కలిసి విజ్ఞప్తి చేస్తే మేము బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాల్సి వస్తుందనే మాకు అపాయింట్ మెంట్ రాకుండా చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి కదిలి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మాకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు. ఇది శోచనీయం, బాధాకరం అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం అన్నారు.
బీజేపీ వితండ వాదం:
బలహీన వర్గాల హక్కులను కాలరాయడానికి బీజేపీ మొదటి నుంచి కుట్రలు చేస్తూనే ఉందని సీఎం విమర్శించారు. నాడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలని చూస్తే బీజేపీ కమండల్ పాలిటిక్స్ కు తెరలేపిందని రథయాత్ర పేరుతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువచ్చిందని ఆరోపించారు. మేము మొదలు పెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును ఎలాగైనా అడ్డుకోవాలని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వితండవాదం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేము పంపిన బిల్లుల్లో ఎక్కడైనా మతానికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం మాత్రమే ఉందని కులాలు ఉప కులాల వారీగా రిజర్వేషన్లు లేవన్నారు. కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి అడ్డుకుంటున్నామని వితండ వాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకు వీళ్లు చదువుకున్నారా? లేక రాజకీయ ప్రేరేపితంతో చట్టాన్ని చదవకుండా కళ్లుమూసుకుని మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. వివిధ వృత్తులు చేపట్టే ముస్లింలకు చట్ట ప్రకారమే ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయని ఇవి మహారాష్ట్ర, గుజారాత్, ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నాయన్నారు. ఓబీసీలు అమాయకులేమి కాదని వారు చట్టం చదువుకున్నారు. వారికి సామాజిక స్పృహ ఉందన్నారు. గల్లీ లీడర్లు మాట్లాడినట్లు కిషన్ రెడ్డి మాట్లాడటం భావ్యం కాదు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని బీజేపీ భావిస్తే అలాగే చట్టం చేయండి. ముస్లింలను మినహాయించి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం చట్టం చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే రెండ్రోజుల్లోనే చట్టం ఆమోదం పొందుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మా విధానం.. బీజేపీ విధానం ఏమిటో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ శిఖండి పాత్ర:
బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని సీఎం ధ్వజమెత్తారు. ఎలాగైనా కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ప్రభుత్వం చేస్తున్న ఏ మంచి పనికి సహకరించమని బీజేపీతో అంటకాగుతోందన్నారు. బీజేపీ తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదు? నిన్నటి ధర్నాలో బీఆర్ఎస్ పాల్గొనలేదని ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొనకుండా మమ్మల్నీ అవమానిస్తోందని దుయ్యబట్టారు. తాటిచెట్టంత పెరగడం కాదు ఆవగింజంత అవగాహన కూడా ఉండాలన్నారు. మమ్మల్నీ బలహీనం చేసేట్టు, మా చేతులు కట్టేసేట్టు వ్యవహరిస్తోంది తప్పా బీసీలకు మద్దతుగా నిలబడదామన్న సోయి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ బీసీలకు కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వడం లేదన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్, 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించకుండా బీజేపీ బీసీ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. తాత్కాలికంగా మీరు విజయం సాధించామని అనుకోవచ్చు. కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుందన్నారు. చిత్తశుద్ధితో మూడు రోజులుగా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే కేంద్ర నుంచి ఏ మాత్రం సహకారం లేదని ఇకనైనా రాష్ట్రపతి బిల్లులను ఆమోదించేలా సూచన చేయాలని, మేము కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కనీసం నైతిక చర్యగా నైనా బీసీలకు మద్దతు ఇవ్వడం లేదన్నారు.
పీఏసీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ:
బీఆర్ఎస్, బీజేపీ దుర్మార్గమైన చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తోందని వీరి తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందని సీఎం చెప్పారు. త్వరలోనే ఇందుకోసం హైదరాబాద్ లో పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా విధానం అని పార్టీ పరంగా ఇవ్వాలా, మరేదైనా ఉపాయం ఉందేమో పీఏసీలో చర్చిస్తామన్నారు. హైకమాండ్ అభిప్రాయంతో కోర్టులో వాదన వినిపిస్తామన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించకుంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పీఏసీ సమావేశంలో చర్చిస్తామన్నారు. నిన్నటి ధర్నాలో రాహుల్, ఖర్గే రాలేదన్న వాదన అర్థరహితం అన్నారు. కిషన్ రెడ్డికి అనుమానాలు ఉంటే అధికారిక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని కులాల వివరాలు సేకరించి కులగణన చేశామన్నారు.






