Revanth Reddy : ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-21 07:20:03  IST  )

తెలంగాణ పోలీసుశాఖ(Telangana Police Department) దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు.

Revanth Reddy : ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసుశాఖ(Telangana Police Department) దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణమని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే అని చెప్పారు. రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తోందని అన్నారు. ఒకవైపు నేరాల అదుపు, మరోవైపు నేరాల విచారణ, ట్రాఫిక్ నియంత్రణ, పగటి గస్తీ, రాత్రి గస్తీ, బందోబస్తు, VIP రక్షణ.. ఇలా సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం చేస్తుంటారని వెల్లడించారు. ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తుచేశారు. అందుకే మా ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టిందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం. విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్ల లోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం.

మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు. సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించాం. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం. ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను పెంచాం. పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పోలీస్‌ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Read More: Revanth Reddy : మావోయిస్టులకు CM రేవంత్ కీలక పిలుపు

TG DGP: శాంతిభద్రతలు అదుపులో లేకుంటే అభివృద్ధి అసాధ్యం

Next Story