CM Revanth: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ హెల్త్ సిటీ ఏర్పాటు

by Gantepaka Srikanth |

తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో ఆసుపత్రి నూతన బ్రాంచిని హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు.

CM Revanth: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ హెల్త్ సిటీ ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో ఆసుపత్రి నూతన బ్రాంచిని హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న అపోలో యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను సీఎం వివరిస్తూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయి ‘హెల్త్ సిటీ’ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని.. చికిత్స కోసం విదేశాల నుంచి వచ్చే వారి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల నుండి నేరుగా హైదరాబాద్‌కు విమాన సర్వీసులు నడిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఎయిర్‌పోర్టు నుంచి పేషెంట్లను వేగంగా ఆసుపత్రులకు చేర్చడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీతో మాట్లాడి ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

46 ఏళ్ల క్రితం చెన్నైలో మొదటి ఆసుపత్రిని ప్రారంభించిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి, నేడు దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల స్థాపనకు మార్గదర్శిగా నిలిచారని సీఎం కొనియాడారు. అపోలో అనే పదం నేడు కోట్లాది మంది ప్రజలకు గుండె ధైర్యంగా మారిందని, సమాజానికి ఆదర్శంగా నిలిచిన వారి యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మా రాజధానిగా ఉందని సీఎం గుర్తుచేశారు. కోవిడ్ సమయంలో ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే ఉత్పత్తి కావడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణ అంటేనే వ్యాపార అనుకూల రాష్ట్రమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను ఆయన ఒక సోషల్ డాక్టర్ అంటూ ఆయన వైద్య, ఆరోగ్య శాఖకు అందిస్తున్న సేవను సీఎం కొనియాడారు.

Next Story