కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే : సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-28 15:05:48  IST  )

కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని, అలాంటి నేతపై విమర్శలు చేయడం తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే : సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ దర్శక నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

భారతదేశ చరిత్రలో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన గొప్ప నేతల్లో ఎన్టీఆర్ ఒకరు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయి స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు ఆయనే. దేశం ఉన్నంత కాలం, మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతిరత్నాల కీర్తి, ప్రతిష్టలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం ఉన్న నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.

విమర్శలకు భయపడను.. హైదరాబాద్ నడిబొడ్డున అందుకే పెట్టాం!

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని పెట్టడంపై వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. "ఎన్టీఆర్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మైత్రీవనం చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాం. ఒక ముఖ్యమంత్రిగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన. ఈ విషయంలో నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు" అని సీఎం తేల్చిచెప్పారు.

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే!

తెలంగాణ రాజకీయాలపై ఎన్టీఆర్ వేసిన చెరగని ముద్రను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. "తెలంగాణ నాయకత్వానికి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి దిగ్గజ నాయకులను అందించింది ఎన్టీఆరే. అంతెందుకు.. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా అన్నగారే. అలాంటి అన్న నీడన బతికి, ఈ రోజు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటం సంస్కారం కాదు. అన్నగారి పేరు పెట్టుకున్న వారు కూడా ఈ రోజు విమర్శలు చేసే స్థాయికి దిగజారారు" అని విపక్షాలపై సీఎం రేవంత్ పరోక్షంగా విరుచుకుపడ్డారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ‘ప్రజాపాలన’

ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎన్టీఆర్, ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితోనే సాగుతోందని సీఎం వివరించారు. నాటి ఎన్టీఆర్ పథకాలే నేటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు పునాది అని ఆయన పేర్కొన్నారు. నాటి పక్కా ఇళ్ల పథకమే నేటి 'ఇందిరమ్మ ఇండ్లు'. నాటి రూ.2 కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే నేటి సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. నాటి జనతా వస్త్రాల ఆలోచనే నేటి ఇందిరమ్మ చీరల వెనుక ఉందని సీఎం రేవంత్ తెలిపారు. రైతులకు నేడు అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌కు.. ఆనాడు ఎన్టీఆర్ తెచ్చిన రూ.50 హార్స్ పవర్ విద్యుత్ నిర్ణయమే ఆదర్శమన్నారు. నాడు పాత పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది ఎన్టీఆరే. నాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఇందిరమ్మ.. బలహీన వర్గాల (బీసీ) కోసం ఎన్టీఆర్ పాటుపడ్డారు. వారు చేసిన కృష వల్లే ఈ రోజు ఆయా వర్గాల వారు పాలకులుగా మారగలిగారని పేర్కొన్నారు.

"ఇందిరమ్మ ఆశీర్వాదం, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి.. ఈ రెండింటి కలయికే మా ప్రజాపాలన. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకూ తమదే అధికారం అని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. నాడు హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసినట్లే.. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

Next Story