- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: మూసీ ప్రక్షాళన అనివార్యం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కాలుష్య కాసారంగా మారకూడదంటే మూసీ ప్రక్షాళన అనివార్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రక్షాళన అనివార్యమని, లేకపోతే హైదరాబాద్ మహానగరం మరో ఢిల్లీలా మారే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ మంచిరేవులలో ఆయన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని అన్నారు. ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. గతంలో గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఆ జలాలను ఉపయోగించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మత సామరస్యానికి మూసీ వేదిక..
ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ (Hyderabad) కాలుష్య నగరంగా మారకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మూసీ ప్రక్షాళన ఇప్పుడు చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపారు. నదులు కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మత సామరస్యానికి మూసీ వేదిక కానుందని పేర్కొంటూ.. ఉప్పల్-నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి, పురానాపూల్‌లో మసీదు నిర్మిస్తామని వెల్లడించారు. అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతామని, గోదావరి జలాలను మూసీకి తరలించి నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసీతో ఉమ్మడి నల్లగొండ అల్లాడుతోంది..
హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలో కలుస్తోందని, దీనివల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని అన్నారు. కానీ, కొందరు రాజకీయ కారణాలతో పనులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.






