- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC, HMDA అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)కు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర పాలసీ తయారుచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైనా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్అడ్మినిస్టేషన్(GHMC) అండ్ అర్బన్ డెవెలప్మెంట్(HMDA)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై పూర్తి వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డుపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాగునీరు కలుషితం కాకుండా చూడటంతో పాటు, దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్- సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి ప్రాజెక్టు విభాగం అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25ఏండ్లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, మెట్రోపాలిటన్, అర్బన్ డవలప్మెంట్ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, ఎఫ్సీడీఏ కమిషనర్ కె. శశాంక, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ.నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






