జల వివాదం.. ముంబైలో సీనియర్ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Ramesh Naini |

జల వివాదం.. ముంబైలో సీనియర్ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ అంశంపై కీలక వాదనలు జరగనున్నాయి. ఈ వాదనలకు తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు గాను ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జల వివాదాలపై చట్టపరమైన అంశాలు

పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు, రాష్ట్ర హక్కులు, జల వివాదాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు మరింత పటిష్టంగా వినిపించేలా న్యాయపరమైన వ్యూహాలను ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రానున్న విచారణ తెలంగాణ జల హక్కుల పరిరక్షణలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story