రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035 ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Naini |   (  Updated:2025-10-09 14:37:20  IST  )

రాష్ట్రంలో రాబోయే ఐదు ఏళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందించింది.

రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035 ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాబోయే ఐదు ఏళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు (Horticultural University Plans) రూపొందించింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళికలో పేర్కొంది. గురువారం సచివాలయంలో (Minister Tummala Nageswara Rao) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ డి. రాజిరెడ్డిలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035 ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రణాళికలో ఉద్యాన విశ్వవిద్యాలయం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడంతో ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు.

పండ్లు కూరగాయల విస్తీర్ణం పెంచడం :

పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాల్లో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030 కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్, క్యాబేజీ, దోస, కాలిఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్ సీజన్ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలు పరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్ నెట్ లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి.

పంట దిగుబడి పెంపునకు ప్రయత్నాలు :

ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచిన అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.

కోతానంతర గిడ్డంగులు, మార్కెటింగ్​ వ్యవస్థ కల్పించాలి :

కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్ యార్డ్, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్ హౌస్ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ, కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వ కాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి.

రైతు సంఘాల ద్వారా విక్రయాలు జరగాలి :

రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు, కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్ యార్డ్లలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కలిసి నిర్వహించేలా ఉద్యాన విశ్వవిద్యాలయం నెలకొల్పాలి రైతులకు సకాలంలో సూచనలు అందించాలి.

Next Story