రైతు భరోసా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

by Taduka Kalyani |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు.

రైతు భరోసా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, సదాశివనగర్ (రామారెడ్డి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా రామారెడ్డి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతుల పెట్టుబడి భారం తగ్గించడం, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం వల్ల పారదర్శకతతో పాటు సకాలంలో పెట్టుబడి అందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌లో 10,851 మంది రైతులకు రూ.9,35,33,533, అలాగే 2025–26 యాసంగి సీజన్‌లో 10,950 మంది రైతులకు రూ.7,34,81,576 రైతు భరోసా నిధులు అందించినట్లు వెల్లడించారు. రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు తక్షణమే జమ అవుతాయని, మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో వచ్చే తొమ్మిది రోజుల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రైతు భరోసా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, నిధుల జమ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్లు రవితేజ, ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, రామారెడ్డి ఉప సర్పంచ్ నవీన్, ఎంఈవో, ఏడీఏ సుధా మాధూరి, సర్పంచ్ ప్రవీణ్, డీఏవో మోహన్, తహసీల్దార్ సుమలత, ఏవో మినుకుల రాకేష్, భానుశ్రీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story