యాదగిరి గుట్టపై గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి తిరుమల మోడల్ అనుసరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

‘యాదగిరి గుట్టపైన గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలి. విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి తిరుమల మోడల్ ను అనుసరించాలి.

యాదగిరి గుట్టపై గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి తిరుమల మోడల్ అనుసరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘యాదగిరి గుట్టపైన గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వాళ్ల జాబితా రూపొందించాలి. విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి తిరుమల మోడల్ ను అనుసరించాలి. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలి’ అని ఎండోమెంట్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్ లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపైన మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ రేట్ ప్రకారం భూమి కేటాయించాలన్నారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుపైన ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారుచేయాలని సూచించారు.

భూమి యాజమాన్యపు హక్కులు మాత్రం టెంపుల్ వద్దనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణంపైన ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపైన అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ విధానంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంఓ సెక్రటరీ మానిక్ రాజ్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Next Story