- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకులాల్లో మార్పు మొదలు: సీఎస్‌కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గత అకడమిక్ ఇయర్ లో చాలా గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ సారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎస్ రామకృష్ణరావును సీఎం ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం చీఫ్ సెక్రెటరీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జూన్ రెండో వారంలో గురుకులాలను తెరిచే అవకాశమున్నందున ఈలోపే ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని, విద్యార్థులకు కావాల్సిన డ్రెస్సులు, షూస్, ఇతర వస్తువులను కొనుగోలు చేయాలని ఆదేశించారు.
సీఎస్ కు ప్రత్యేక బాధ్యతలు
గత అకడమిక్ ఇయర్ లో చాలా గురుకులాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ సారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎస్ రామకృష్ణరావును సీఎం ఆదేశించారు. దీంతో సీఎం రెండు రోజుల క్రితం అన్ని గురుకులాల కార్యదర్శులతో సమావేశమై, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి బిల్డింగ్స్ కు ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయాలని ఆదేశించారు. కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టూడెంట్స్ కు అందించే ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అకడమిక్ ఇయర్ ప్రారంభమైన వెంటనే, జిల్లా కలెక్టర్లు రెగ్యులర్ గా గురుకులాలకు వెళ్లి, అక్కడున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించినట్లు సమాచారం.
బకాయిల చెల్లింపు పై ఫోకస్
చాలా గురుకులాలు రెంట్ బిల్డింగ్స్ లో కొనసాగుతున్నాయి. వాటికి రెంట్స్ చెల్లించడంలో జాప్యం జరుగుతున్నది. అలాగే హాస్టల్ బిల్లుల చెల్లింపు లేట్ అవుతున్నది. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపాలని గురుకులాలకు చెందిన కార్యదర్శులు ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లుల్లో కొన్నింటిని వెంటనే రిలీజ్ చేసేందుకు సీఎస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే నాణ్యమైన బియ్యం, కూరగాయలు, పప్పులు సరఫరా చేయకపోతే సదరు కాంట్రాక్టర్లను వెంటనే తొలగించి, కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం.






