CM Revanth Reddy: తెలంగాణకు స్వాగతం.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-04-18 11:32:52  IST  )

CM Revanth Reddy: తెలంగాణకు స్వాగతం.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆహ్వానం పలికారు. జపాన్ పర్యటనలో (Japan Tour) భాగంగా ఇవాళ టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో (India-Japan Economic Partnership Roadshow) రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ రోడ్ షోలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జపాన్ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. ‘దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది అని పేర్కొన్నారు.

టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా...

టోక్యో చాలా గొప్ప నగరం అని ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం అని సీఎం అన్నారు. ‘జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను’ అని సీఎం చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని.. భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.

తెలంగాణ అనుకూలం..

ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు. దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. రోడ్‌షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం, జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. సమావేశంలో భారత రాయబారి సీబీ జార్జ్ భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. జెట్రో (జపాన్ ఎక్స్‌టర్‌న‌ల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ.. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story