మాటలు కాదు.. చేతల్లో చేసి చూపించిన CM రేవంత్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించే దిశగా కీలక అడుగు వేశారు.

మాటలు కాదు.. చేతల్లో చేసి చూపించిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించే దిశగా కీలక అడుగు వేశారు. సాధారణంగా వీవీఐపీల కాన్వాయ్ వెళ్తుందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను నిలిపివేయడం ఆనవాయితీ. కానీ, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే.. నిన్న (బుధవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సీఎం, వెంటనే పోలీసు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం సరైన పద్ధతి కాదని, ప్రజల సమయాన్ని వృథా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీకి, ట్రాఫిక్ విభాగం అధికారులకు కింది ఆదేశాలు జారీ చేశారు. సీఎం కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనాలను పూర్తిగా నిలిపివేయకూడదు. ప్రజలకు, ముఖ్యంగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకూడదు. సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేస్తూ, ఇతర వాహనాలను అనుమతించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో మారిన దృశ్యం..

ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, ఈరోజు ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వచ్చే సమయంలో ఎక్కడా ట్రాఫిక్‌ను స్తంభింపజేయలేదు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో కేవలం ఒక లైన్‌ను మాత్రమే కేటాయించి, మిగిలిన లైన్లలో సాధారణ వాహనాల రాకపోకలను కొనసాగించారు. "ప్రజా ప్రభుత్వం" అని చెప్పుకునే తన పాలనలో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ట్రాఫిక్‌లో ప్రయాణించడం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story