CM Revanth Reddy: పద్మశాలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.కోటి అనౌన్స్

by Prasad Jukanti |   (  Updated:2025-03-09 10:22:04  IST  )

అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: పద్మశాలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.కోటి అనౌన్స్
X

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పద్మశాలిలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మా ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నదన్నారు. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Ground) లో అఖిల భారత పద్మశాలి మహాసభకు (Akhila Bharatha Padmasali Mahasabha) ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ (Eravathri Anil), పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజం అన్నారు. అలాంటి ఆలె నరేంద్రను (Ale Narendra) కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ (KCR) అనే ధృతరాష్ట్రడు అలె నరేంద్ర పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలను అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానం అన్నారు.

ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు:

బీఆర్ఎస్ పెట్టినప్పుడు నీడ కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూకు (Konda Laxman Bapu) కేసీఆర్ నిలువ నీడ లేకుండా చేశారని ఆయన చనిపోతే కనీసం చూడటానికి వెళ్లలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ లేదు. గత ప్రభుత్వం ఆ ప్రయత్నమూ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్‌టీ సాధించడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ బాపూజీ పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శమూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు. తెలంగాణ సాధన, తెలంగాణ నిర్మాణంలో పద్మశాలీలది గొప్ప పాత్ర అని కొనియాడారు. గత పాలకుల కుటుంబాలు జోలె పెట్టుకుని సిరిసిల్లకు వస్తే ఆ జోలెలో ఓట్లు, నోట్లు వేసి వారికి రాజకీయ నీడ ఇచ్చింది పద్మశాలిలు కాదా అన్నారు.

మార్కండేయ భవనం నిర్మాణానికి రూ.కోటి:

మహారాష్ట్రలోని షోలాపూర్ లో మన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం (Markandeya Building) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పద్మశాలిల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నానని సీఎం చెప్పారు. మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు కావాల్సిన పనులు చేయించుకోండి. చేయించుకోకపోతే అది మీ తప్పే అవుతుంది. మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం అన్నారు. మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రావాలని వాటిని ఆమోదించే బాధ్యత నాది అని చెప్పారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులో నాకు ఈ పదవి వచ్చింది. మీ అభిమానాన్నే నేను ఆశిస్తున్నాను. మీరు నన్ను గుండెల్లో పెట్టుకోడి మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీలు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు బకాయిలు పెట్టి ప్రభుత్వాన్ని మాకు అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం నాసిరకమైన బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. మేము వచ్చాక ఆ ఆర్డర్లను రద్దు చేస్తే నేతన్నలు ఇబ్బందులు పడతారని టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఈ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి 30 లక్షల చీరలు పద్మశాలీలకు ఆర్డర్ ఇచ్చామన్నారు.

కులగణనను పురిటిలోనే గొంతునొక్కాలని కుట్ర:

కులగణనను (Caste Census) పురిటిలోనే గొంతునొక్కాలని కొంత మంది కుట్ర చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఆ కుట్రదారులను తిప్పికొట్టాలని మీ శక్తి, యుక్తిని ప్రదర్శించి నాకు అండగా నిలబడాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి చూపిస్తానన్నారు. మా లెక్కలపై బీఆర్ఎస్(BRS), బీజేపీలు (BJP) విమర్శలు చేయడం కాదని ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని అసెంబ్లీలో సవాల్ విసిరితే తోకముడిచారన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్దం అయితే అది కేంద్రంలో నరేంద్ర మోడీ మెడ మీద కత్తిలా మారుతుందని అందుకే బీఆర్ఎస్, బీజేపీ కలిసి తొండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Next Story