- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల ఆత్మహత్యలకు సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత
రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని వీటికి సీఎం రేవంత్ రెడ్డియే పూర్తి బాధ్యుడని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది.

- వ్యవసాయ సంక్షోభం, ముఖ్యమంత్రి చేతకానితనమే కారణం : బీఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని వీటికి సీఎం రేవంత్ రెడ్డియే పూర్తి బాధ్యుడని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంక్షోభం, హామీల వైఫల్యం కారణంతో అన్నదాతలు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ముఖ్యమంత్రి చేతకానితనంతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి, తీవ్రంగా నష్టపోయిన మొగిలి లక్ష్మణ్ ప్రాణాలు తీసుకుంటే రైతుబంధు వంటి పెట్టుబడి సాయం లేక, ఆర్థిక భారంతో అప్పుల పాలై గూగులోత్ భాస్కర్ బలయ్యారని పేర్కొంది. భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక నాలికి అనిల్ అనే యువ రైతు కుటుంబాన్ని విషాదంలో ముంచి తనువు చాలించాడని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు వరుసగా తమ నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పదేళ్ల ప్రస్థానంలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే ఎన్‌సిఆర్‌బి నివేదిక తేల్చిచెబితే మళ్ళీ కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో ఈ మరణమృదంగం ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణ గడ్డపై రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదమే కాదు, ముంచుకొస్తున్న విలయానికి సంకేతమని అభిప్రాయపడ్డారు. రైతులకు మనోధైర్యాన్ని ఇస్తూ రైతన్నలారా అధైర్యపడకండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందాం. అప్పటి వరకు సంఘటితంగా పోరాడదాం. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామని భరోసా ఇచ్చారు.






