తెలంగాణ మైనార్టీలకు గుడ్ న్యూస్.. రెండు సూపర్ స్కీములు ప్రారంభం

by Gantepaka Srikanth |

తెలంగాణ మైనారిటీల(Telangana Minorities) సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో చారిత్రాత్మక అడుగు వేసింది.

తెలంగాణ మైనార్టీలకు గుడ్ న్యూస్.. రెండు సూపర్ స్కీములు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మైనారిటీల(Telangana Minorities) సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Lakshman) ప్రారంభించారు. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం’ పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియకు సంబంధించిన పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన(indiramma Yojana) తోడ్పడుతుందని తెలిపారు. ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడు. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వెలువడ్డాయని పేర్కొన్నారు.

ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనం అని తేల్చారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ సూచించారు. మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు, వారిని స్వయం ఉపాధికి దారి చూపడం మా లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని అన్నారు. చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమే మా సంకల్పం అని వెల్లడించారు. ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదు, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.

లాంచ్ చేసిన పథకాలు :

1. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా రూ.50,000 ఆర్థిక సాయం.

2. రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం: ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా రూ.1.00 లక్ష గ్రాంట్.

రిజిస్ట్రేషన్ల వివరాలు :

ప్రారంభం : 19-09-2025

చివరి తేదీ : 06-10-2025

ఆన్‌లైన్ : TGOBMMS వెబ్‌పోర్టల్ (tgobmms.cgg.gov.in) ఆఫ్‌లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.

Next Story