CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్.. ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఎనర్జీ పాలసీపై ఫోకస్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం విదేశీ పర్యటనకు బయలుదేరింది.

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్.. ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఎనర్జీ పాలసీపై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం విదేశీ పర్యటనకు బయలుదేరింది. ఇందులో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బృందం సింగపూర్‌కు బయలుదేరింది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో సీఎం సింగపూర్‌లో మూడు రోజులుపాటు పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించనున్నారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నారు. అనంతరం సింగపూర్ లో రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలించనున్నారు.

దావోస్‌లో మూడు రోజులు..

సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృందం ఈనెల 20వ తేదీ ఉదయం దావోస్ కు చేరుకుంటుంది. 20 నుంచి 22 వరకు అక్కడ జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొననున్నది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడులే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్షలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది.

ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ) పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏడాదిలో చేపట్టిన విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయి. గతేడాది దావోస్ పర్యటనతోపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దేశంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ విదేశీ పర్యటన చేస్తున్నది.

Next Story