మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

by Taduka Kalyani |   (  Updated:2026-07-27 11:42:51  IST  )

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
X

దిశ, మక్తల్: మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం కాట్రపల్లి గ్రామంలోని స్టేజ్-1 పంప్ హౌస్‌ను ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఐఏఎస్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, సీఈ సత్యనారాయణ రెడ్డి తదితరులు స్టేజ్-1 పంప్ హౌస్ వద్ద మూడో పంపు ఏర్పాట్ల పనులను తనిఖీ చేశారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదనపు మూడో పంపు బిగింపు పనులతో పాటు సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాట్రపల్లి, బాపూర్, పేరపళ్ల ఎత్తిపోతల పంప్ హౌస్‌ల వద్ద మూడో పంపును స్పేర్‌గా అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఏదైనా పంపు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన సమయంలో మూడో పంపు ద్వారా నీటి పంపింగ్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రాజెక్టు ద్వారా నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా నీటి సరఫరా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. పనుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఫేజ్-1 పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఈఈ నాగశివ, ఈఈ గోపాలచారి, నీటిపారుదల శాఖ అధికారులు, రాఘవ కన్స్ట్రక్షన్ జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story