- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక సమావేశం
మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక కాపీలను ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నేడు (ఇన్ ఫార్మల్ కేబినెట్ మీటింగ్) సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపైనా చర్చ జరగనుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రులు నియోజకవర్గాలు, వారు ఇన్‌చార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీ ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థుల ఫలితాలపైనా విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీ ఎన్నికలను సైతం నిర్వహించాలని భావించడంతో తాజాగా సొసైటీల ప్రస్తుత పాలకవర్గాలను రద్దుచేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం సైతం ఉండనుందని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసిందని భావిస్తున్న తరుణంలో పనితీరు బదిలీలు ఉంటాయని.. దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాల్లో చేర్చనున్నట్లు సమాచారం.
మంత్రుల పనితీరుపై చర్చ
మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదిక కాపీలను ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమ పరిధిలోని శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలతో పాటు మరికొందరు జిల్లాల్లో గ్రూపు తగాదాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రులను సున్నితంగా హెచ్చరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మంత్రుల శాఖల మార్పుపై సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిటీ కమిషనర్ సజ్జానర్ చీఫ్ గా సిట్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజుల పాటు పొడగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దీనితో ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తలెత్తే రాజకీయ పరిణామాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది.
అసెంబ్లీ సమావేశాలపై చర్చ
సీఎం.. మంత్రుల సమావేశంలో అసెంబ్లీ శీతకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతాం.. దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సమావేశాల తేదీ కూడా దాదాపు ఖరారు అయినట్లుగానే భావించవచ్చు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను కోర్టు కొట్టివేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పీలు చేయనున్నారు. అలాగే రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో సర్కారు సాధించిన విజయాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు.






