CM Revanth Reddy: నెల రోజులు అక్కడ పని చేయండి.. రాష్ట్రంలోని వైద్యులకు సీఎం విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2025-07-02 07:40:07  IST  )

విద్య, వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy: నెల రోజులు అక్కడ పని చేయండి.. రాష్ట్రంలోని వైద్యులకు సీఎం విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్య, వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య ఇస్తోందని సర్కార్ ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సామాజికి బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకుని నెలరోజుల పాటు పని చేయాలని నిమ్స్, ఉస్మానియాలో పని చేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. నిమ్స్ లో అదనపు బ్లాక్, ఎల్ బీ నగర్, సనత్ నగర్ లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని త్వరలో అందుబాటులోకి 25 ఆసుపత్రులు రాబోతున్నాయన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లో ఏఐజీ ఆసుపత్రిని (AIG Hospital) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాబోయే వందేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దానిపై తెలంగాణ రైజింగ్ -2024 (Telangana Rising 2047) అనే విజన్ డాక్యుమెంట్ ను తయారు చేస్తోందని ఇందులో హెల్త్ టూరిజంకు (Health Tourism) ప్రాధాన్యత ఉండబోతున్నదని చెప్పారు.

హెల్త్ టూరిజం పై ఫోకస్:

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉండేలా హెల్త్ డిపార్ట్ మెంట్ ను, హెల్త్ టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. అందులో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్ గా నియమించుకున్నామన్నారు. మహిళలే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అందువల్ల వ్యాధి బారిన పడిన తర్వాత ఖర్చు చేసే కంటే వ్యాధి బారిన పడకముందే తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ అవసరం అన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు భారంగా మారాయని అందుకే మేము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ 18 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1400 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

మహిళా సంఘాల సభ్యులకు హెల్త్ ప్రొఫైల్స్:

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో ఉన్నదని సీఎం చెప్పారు. వీరికి వ్యక్తిగతంగా యూనిక్ ఐడీతో గుర్తింపు కార్డు ఇచ్చి వారి హెల్త్ ప్రొఫైల్ కార్డు రూపొందిస్తామని ఈ కార్డులో వారి కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తం చేస్తామన్నారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండేది. అది పోయి స్పెషలిస్టు వ్యవస్థ వచ్చింది. దీంతో రోగులకు వైద్యులకు మధ్య కేవలం లావాదేవీల వ్యవస్థగా మారిందన్నారు. దీన్ని బ్రేక్ చేయాల్సి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఐఐ గణాంకాల ప్రకారం సంవత్సరంలో 2 లక్షల 20 వేల మంది విదేశాల నుంచి రోగులు వచ్చి హైదరాబాద్ లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇంకా రావాలని రోగులు ఆసక్తి చూపుతున్నా మధ్య ప్రాచ్య దేశాల నుంచి హైదరాబాద్ కు నేరుగా ఫ్లైట్ కనెక్టివిటి లేకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పరిస్థితిపై కేంద్రంతో తాను మాట్లాడి భవిష్యత్ లో కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జనని మిత్ర యాప్ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా మన నగరం గొప్పతనం చాటిచెప్పామన్నారు.

Next Story